
చంద్రయాన్.. చంద్రయాన్.. చంద్రయాన్.. ఇప్పుడు భారతీయులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా జపిస్తున్న నామమిది. ఒకరకంగా అందరి చూపూ చంద్రయాన్-3 వైపే ఉంది. చందమామపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే మధుర క్షణాల కోసం యావత్ జాతి ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ప్రతి ఒక్కరి కళ్లూ అటువైపే అన్నట్లు భారతీయులంతా ఉద్విగ్నంగా ఎదురుచూసే అపురూప ఘడియలకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ క్షణాలను కలకాలం గుర్తుంచుకునేలా చిన్న పిల్లల నుంచి యువకుల వరకు అందరూ చూడాలంటూ ఇస్రో(ISRO) పిలుపునిచ్చింది. మొదటగా స్కూళ్లు, కాలేజీల్లో స్క్రీన్లు ఏర్పాటు చేయాలని భావించారు. కానీ సాయంత్రం తర్వాత చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుండటంతో.. అప్పటివరకు స్టూడెంట్స్ ను వెయిట్ చేయించే బదులు ఎవరి ఇళ్లల్లో వారినే టీవీల్లో చూసేలా చైతన్యం కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది.
దీనిపై తెలంగాణ సర్కారు తొలుత స్కూళ్ల సమయాన్ని పొడిగించింది. కానీ ఆ తర్వాత డిసిషన్ మార్చుకుంది. సాయంత్రం ఇళ్ల వద్దే చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షించడం.. మరుసటి రోజు విద్యాసంస్థల్లోనే ఆ ప్రక్రియను యూట్యూబ్ ద్వారా చూపించడం చేయాలని నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్-3 ప్రయోగంపై విపరీతమైన ఆసక్తి నెలకొనడం, భారత సైంటిస్టుల ప్రతిభాపాటవాలకు అంతర్జాతీయంగా ఆదరణ దక్కుతుండంటంతో ఈ రోజు జరిగే కీలక స్టెప్ పైనే అందరి దృష్టీ ఉంది.