రైల్వే టికెట్ల(Tickets) బుకింగ్ లపై రెండ్రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం(Circulation) పూర్తిగా అవాస్తవమని రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. ‘IRCTC పర్సనల్ ఐడీతో ఇతరుల కోసం టికెట్లు బుక్ చేయకూడదని.. అలా చేస్తే రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం రూ.10 వేల ఫైన్ తోపాటు మూడేళ్ల జైలు శిక్ష’ అంటూ పెద్దయెత్తున ప్రచారం జరిగింది. వ్యక్తిగత ఐడీ ద్వారా కేవలం ఒకే ఇంటి పేరుగల వ్యక్తులకే టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నది ఆ వార్త సారాంశం. ఇది నిజమని నమ్మి చాలామంది ఆందోళన చెందారు. కానీ ఇదంతా తప్పు అని IRCTC వివరణ ఇచ్చింది.
కొత్త రూల్స్…
ఈ-టికెట్స్ బుకింగ్ విధానంలో కొత్త రూల్స్ తీసుకువచ్చింది IRCTC(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్). ఎవరైనా సరే తమ వ్యక్తిగత IDతో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, బంధువులకు టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కొనసాగిస్తూనే నెలకు 12 మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. ఆధార్ వెరిఫై చేసుకున్న యూజర్లు మాత్రం నెలకు 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. వ్యక్తిగత(Individual) IDతో బుక్ చేసిన టికెట్లను కమర్షియల్ గా అమ్ముకోవడానికి వీల్లేదని, అలా చేస్తే రైల్వే చట్టం 1989 ప్రకారం ఉల్లంఘన కిందకు వస్తుందని తన ‘X’ అకౌంట్లో IRCTC వెల్లడించింది.