
చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్ 1… ఈ రెండూ రోదసిలో విజయవంతంగా చక్కర్లు కొడుతుండగా.. అదే ఉత్సాహంతో ఇస్రో(ISRO) మరో రెండేళ్ల పాటు బిజీ షెడ్యూల్ ని తయారు చేసుకుంది. ఇంచుమించు ఒకటి తర్వాత ఒకటిగా అన్ని గ్రహాలపైకి ఉపగ్రహాలు పంపాలని ప్లాన్ చేసింది. తద్వారా విస్తృతంగా ప్రయోగాలు నిర్వహించడానికి రెడీ అవుతోంది. చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్ 1 తర్వాత నెక్ట్స్ ఏంటి. దీనికి సమాధానంగా ఇప్పటికే రెడీగా ఉంది ‘గగన్ యాన్-1’. మానవరహిత అంతరిక్ష యాత్రగా భావించే ‘గగన్ యాన్-1’ ద్వారా మనుషులు లేకుండానే ఇప్పటి చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్ 1 మాదిరిగా ప్రయోగాలు సాగించనుంది. రోదసిలోకి మనుషుల్ని 2025 వరకు పంపాలని టార్గెట్ పెట్టుకున్న ISRO.. ఆ దిశగా తొలుత ‘గగన్ యాన్-1’ను పంపనుంది. దీన్ని ఈ అక్టోబరు మొదటి వారంలో నింగిలోకి పంపనున్నారు. ‘గగన్ యాన్-2’కు ట్రయల్ గా ‘గగన్ యాన్-1’ ను అక్టోబరులో పూర్తి చేయనుండగా.. దానికి రెండో భాగాన్ని కూడా కంటిన్యూ చేసే పనిలో ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ రెండూ పూర్తయితే ఇక అసలు లక్ష్యంగా నిర్దేశించుకున్న.. మనుషులతో కూడిన యాత్ర ‘గగన్ యాన్-3’ 2025లో సాకారం చేయాలన్న తలంపుతో ISRO ఉంది. అదే జరిగితే భారత్ మరో కొత్త చరిత్ర సృష్టిస్తుంది.
మరి ‘గగన్ యాన్-3’ తర్వాత తరువాయి ఏంటి అంటే.. అప్పుడూ బిజీగానే ఉండబోతోంది ఇస్రో. వెంటవెంటనే వీనస్ గ్రహంపైకి పంపే ‘శుక్ర యాన్-1’ను 2024 చివరి నాటికి ప్రయోగించబోతున్నది. అదే ఏడాది గురు గ్రహంపైకి ‘మార్స్ మిషన్’, ‘మంగళ్ యాన్-2’ని కూడా ఆచరణలో పెట్టబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్ట్ గా ఇస్రోతో సమన్వయం(Co-Ordination) చేస్తున్నారు. అత్యంత క్లోజ్ గా మానిటరింగ్ చేస్తుండటంతో ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రయోగాలకు సిద్ధపడుతోందని స్పేస్ నిపుణులు అంటున్నారు. దేశ ప్రధానే నేరుగా జోక్యం చేసుకోవడంతో నిధుల పరంగా, ఎంకరేజ్ విషయాల్లో ఎలాంటి డౌట్స్ లేకుండా కార్యక్రమాలు సాగుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలతో సాగాలంటే ఎలాంటి అడ్డంకులు ఉండకూడదన్న సంకల్పంతోనే ప్రధాని డైరెక్ట్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందన్నది మరో మాట.
ఇక భారత్ చేపట్టే ప్రయోగాలు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవై ఉంటున్నాయి. లోబడ్జెట్ తో సాగించే ప్రయోగాలతో ఇస్రో.. చిన్న చిన్న దేశాల్ని సైతం ఆకట్టుకుంటోంది. భారత అంతరిక్ష పరిశోధనలకు ఇదే కీలక ముందడుగుగా భావించాల్సి వస్తున్నదని స్పేస్ నిపుణులు(Experts) అంటున్నారు. ఇప్పటికే భారత సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసినా… చంద్రయాన్-3ని జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి సక్సెస్ ఫుల్ గా పంపడంతో పూర్తి నమ్మకం ఏర్పడినట్లయింది. అటు అంతోఇంతో అనుమానాలు వ్యక్తం చేసిన అగ్రరాజ్యాలకు సైతం.. ఇప్పుడు అసలు సిసలు భారత సత్తా ఏంటో తెలిసివచ్చింది.