రాష్ట్రంలో 2022-23 సంవత్సరానికి గాను IT ఎగుమతుల విలువ రూ.2.41 లక్షల కోట్లని ప్రభుత్వం ప్రకటించింది. ఇంచుమించు 1500 IT కంపెనీలతో హైదరాబాద్ మహా నగరం అత్యంత వేగంగా డెవలప్ అవుతున్నది తెలిపింది. ప్రస్తుతం 9.05 లక్షల ఐటీ ఉద్యోగులు ఉన్నారని… రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంప్లాయింట్ దక్కింది 5.60 లక్షల మందికి అంటూ డేటా రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఐటీ హబ్ తీరు, ఎగుమతుల ప్రగతిపై రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ నోట్ ను విడుదల చేసింది. రూ.20,761 కోట్లతో అమెజాన్ డేటా సెంటర్ తోపాటు ఫాబ్ సిటీ, ఫార్మా సిటీ, చందన్ వెల్లిలో 3 డేటా సెంటర్లు, సేల్స్ ఫోర్స్ గోల్డ్ మాన్ శాచ్స్ సెంటర్లు ఏర్పడ్డాయని వివరించింది. అమెరికన్ ఇన్సూరెన్స్ దిగ్గజ కంపెనీ అయిన మసాచూసెట్స్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.1,000 కోట్ల పెట్టుబడులతో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నదని I&PR తెలిపింది.
IT డెవలప్మెంట్ వల్ల నిర్మాణ, రవాణా, వినోద రంగాలు దూసుకెళ్తున్నాయని నోట్ లో పేర్కొంది. టైర్-2 నగరాల్లో ఐటీ టవర్లతో కొత్త కంపెనీలు ఏర్పాటై ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయంది. 3.5 లక్షల చదరపు అడుగుల్లో రూ.400 కోట్లతో ఐటీ హబ్-2ను ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్ గా అవతరించేలా నిర్మించామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.