IT దిగ్గజ కంపెనీలు TCS, విప్రో, HCL… ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 13 బిలియన్ డాలర్లు(రూ.1.06 లక్షల కోట్లు) విలువైన ఆర్డర్లు దక్కించుకున్నాయి. గతేడాది(2022) ఏప్రిల్-జూన్ ను పరిగణలోకి తీసుకుంటే ఈసారి అంతకన్నా 14% అధికంగా ఆర్డర్స్ పొందాయి. అంతమాత్రాన IT కంపెనీల కష్టకాలం ముగిసినట్లు కాదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. గత మూణ్నెల్ల త్రైమాసికానికి సంబంధించి ఈ మూడు కంపెనీలు మాత్రమే ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. మరో టాప్ కంపెనీ ఇన్ఫోసిస్ తోపాటు మరిన్ని కంపెనీలు త్వరలో రిజల్ట్స్ వెల్లడించనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరమంతా వృద్ధిలో మందగమనం ఉండవచ్చని కంపెనీల మేనేజ్ మెంట్ లే ప్రకటించాయి. అయితే జూన్ త్రైమాసికానికి మూడు కంపెనీలే భారీస్థాయిలో ఆఫర్లు పొందడంతో.. ITలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
అన్ని చోట్లా తక్కువగా రిక్రూట్ మెంట్లు
గత త్రైమాసికంలో అన్ని కంపెనీలు తక్కువ స్థాయిలో రిక్రూట్ మెంట్లు చేసుకున్నాయి. విప్రో, HCL ఉద్యోగుల సంఖ్య 11,000కు పైగా తగ్గితే.. TCS కేవలం 500 మందికి పైగా ఎంప్లాయిస్ ను మాత్రమే రిక్రూట్ చేసుకుంది. ప్రతికూల పరిస్థితుల వల్ల శాలరీ హైక్స్ ను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు HCL ప్రకటించింది. ఇన్ఫోసిస్ కూడా ఇప్పటివరకు శాలరీస్ పెంచకపోగా.. దానిపై సందిగ్ధత నెలకొంది. 2023-24లో 40,000 మంది ఫ్రెషర్స్ ను తీసుకుంటామని, దాంట్లో కోత పెట్టడం లేదని TCS క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా IT కంపెనీలు ఆఫర్ లెటర్స్ ఇచ్చినా ఉద్యోగంలోకి తీసుకునేందుకు ఆలస్యం చేస్తుండటంతో.. ఆ లెటర్స్ పొందిన ఫ్రెషర్స్ ఆందోళనతో ఎదురుచూస్తూనే ఉన్నారు.