రాష్ట్రంలో ఇక కింగ్ ఫిషర్ బీర్లు దొరకవా.. పండుగకు ముందు సరఫరా మొత్తం నిలిచిపోనుందా.. ఇవన్నీ నిజమనేలా ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం అలా ఉంది మరి. ఈ విషయంలో యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్(United Breweries Limited) కంపెనీ.. తెలంగాణవ్యాప్తంగా బీర్ల సరఫరా(Supply)ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు ఎక్సైజ్ కమిషనర్ ను కలిసి రేట్లు పెంచేవరకు బీర్లను నిలిపివేస్తున్నామన్నారు. తయారీదారులకు చెల్లించే బేస్ ధరను పెంచకపోవడంతో కంపెనీకి నష్టాలు వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని SEBI(సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కి రాసిన లేఖలోనూ UBL తెలిపింది. 2019-20 నుంచి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(TGBCL) ధరల్ని సవరించనందున నష్టాలు వస్తున్నట్లు తెలియజేసింది.
ధరలు పెంచకపోగా, పాత బకాయిలు పెండింగ్ లో ఉండటంతో సప్లై ఆపేస్తున్నట్లు సెబీకి తెలియజేసింది. సంక్రాంతి దృష్ట్యా మందుబాబులకు ఇది షాకింగ్ నిర్ణయమే. రాష్ట్రానికి మద్యం నుంచే అత్యధిక ఆదాయం రానుండగా, బీర్లలో ఎక్కువగా అమ్ముడయ్యేది కింగ్ ఫిషర్ కంపెనీవే. కింగ్ ఫిషర్, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా, కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్స్ తోపాటు 7 రకాల బ్రాండ్లు 70 శాతానికి పైగా అమ్ముడవుతుంటాయి. తమ బీర్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.4,000 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా ధరలు సవరించడం లేదని కంపెనీ ఆవేదన వ్యక్తం చేసింది.