మెట్రో రైలు అంటేనే చెకింగ్ లు, పూర్తి స్థాయి భద్రతతో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి లగేజీని, అటు ప్రయాణికుల్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తూనే ఉంటారు సెక్యూరిటీ సిబ్బంది. ఒక రకంగా పూర్తిస్థాయి నిఘా నీడలో ప్రయాణమన్న మాట. అలాంటి రైళ్లలో లిక్కర్ గురించి ఆలోచన చేసేదేముంటుంది. కానీ దిల్లీ మెట్రో రైళ్లల్లో ఇక నుంచి దర్జాగా లిక్కర్ తీసుకెళ్లొచ్చు. ఎలాంటి చెకింగ్ లు, ఇబ్బందులు లేకుండా మందు బాటిళ్లు తరలించొచ్చు. అయితే ఒక్కో వ్యక్తి కేవలం రెండు సీల్డ్ బాటిళ్లు మాత్రమే తీసుకెళ్లే వెసులుబాటు ఉందని దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC) ట్విటర్ ద్వారా వెల్లడించింది.
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం లిక్కర్ సరఫరాపై దిల్లీ మెట్రోలో నిషేధం ఉంది. అయితే ప్రయాణికుల అవసరాల్ని గమనించిన DMRC… సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) అధికారులతో సంయుక్తంగా కమిటీ వేసింది. అన్ని అంశాల్ని పరిశీలించిన ఈ కమిటీ… ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్లలో సీల్డ్ లిక్కర్ తీసుకెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రైళ్లల్లో మద్యాన్ని తరలించేటప్పుడు ప్యాసింజర్స్ మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని DMRC స్పష్టం చేసింది. ఎవరైనా మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు గుర్తిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.