
Published 24 Nov 2023
అసలే ఎన్నికల కాలం.. ఇక వేలాదిగా పెళ్లిళ్లు.. ఇలాంటి టైమ్ లో మందు, విందులకు కొదువేముంటుంది. మరి ఈ పరిస్థితుల్లో మద్యం విక్రయాల(Liquor Sales) సంగతి చేప్పేదేముంటుంది అంటారా.. కానీ నిజంగానే దాని గురించి చెప్పుకోవాల్సి వస్తోంది. బాగా అమ్ముడవుతుందని కాదు.. సేల్స్ తగ్గిపోయాయని. కొన్ని జిల్లాల్లో లిక్కర్ సేల్స్ తగ్గిపోవడం ఆశ్చర్యకరంగా మారింది. తెలంగాణ ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే అబ్కారీ శాఖకు ఈ పరిణామం మింగుడపడనిదే. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందనగానే ఎక్సైజ్ శాఖకు పెద్దయెత్తున ఆదాయం వచ్చిపడాలి. ఎక్కడికక్కడ మాల్ ను సేల్ చేసుకోవడంలో వైన్స్ లు బిజిబిజీగా ఉంటాయి. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి విందులు ఏర్పాటు చేయడం.. కార్యకర్తలు, మద్దతుదారులను ప్రచారానికి వాడుకునేందుకు బీర్లు, విస్కీని పార్టీల లీడర్లు కొనుగోలు చేస్తుంటారు. కిందిస్థాయి నాయకులు ఆ మద్యాన్ని డంప్ చేస్తుంటారు. కానీ ఈసారి సేల్స్ తగ్గిపోవడం వెనుక మతలబు ఏంటనేది ఆశ్చర్యకరంగా తయారైంది.
ఉదాహరణలివిగో…
గతేడాది నవంబరు, ఈ నవంబరును పరిశీలిస్తే తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. జగిత్యాల జిల్లాలో 2022 నవంబరు 1 నుంచి 31 వరకు రూ.41.84 కోట్ల మద్యం అమ్ముడైంది. ఇందులో 38,659 IML కాటన్లు, 71,110 బీర్ల కాటన్లు ఉన్నాయి. ఈ నెల 1 నుంచి 20వ తేదీ వరకు రూ.28.95 కోట్ల విలువ గల 22,544 కాటన్ల IML, 72,954 కాటన్ల బీర్లు అమ్ముడయ్యాయి. అంటే గత నవంబరు కన్నా IML కాటన్లు 16 వేల కాటన్లు తక్కువగా అమ్మకాలు జరిగితే బీర్లు మాత్రం 1,844 కాటన్ల ఎక్కువగా సేల్స్ జరిగాయి. ఈ లెక్కన రూ.12.88 కోట్ల మేర విక్రయాలు తగ్గిపోయాయి. ప్రతి నెలా ఇంత లిక్కర్ అమ్మాలంటూ అబ్కారీ అధికారులకు ప్రతి నెలా టార్గెట్లు ఉంటాయి. కానీ ఈ ఎన్నికల పుణ్యమాని ఆ భారం లేకపోగా.. అక్రమ మద్యం సప్లయ్ పైనే అధికారులు దృష్టిపెట్టారు.
అసలు కారణం అదేనా…!
ఇంతటి హడావుడి టైమ్ లో లిక్కర్ సేల్స్ లేకపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. అక్రమంగా మద్యం తరలించడం ఒకటైతే కొన్ని లిక్కర్ కంపెనీల నుంచే నేరుగా సేల్స్ జరుగుతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మన రాష్ట్రానికి అక్రమ మద్యం వచ్చేది ఎక్కువగా కర్ణాటక నుంచే. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని సరిహద్దుల మీదుగా సరకు రవాణా జరుగుతుంటుంది. ఇలా అక్రమంగా తెచ్చిన మద్యాన్ని డంప్ లుగా పెట్టుకోవడం వల్లే ఈసారి సేల్స్ తగ్గాయా అన్న అనుమానమూ ఉంది. ఇక రెండోది లిక్కర్ కంపెనీ నుంచి సప్లయ్. టాక్స్ ల రూపేణా ఒక్కో బీర్ సామాన్యుడికి చేరడానికి రూ.150-160 అవుతున్నది. అదే నేరుగా మద్యం కంపెనీలతో కుమ్మక్కైతే ఇవన్నీ ఏం ఉండవు కాబట్టి.. తక్కువ రేట్లకే మందు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్నే కొన్ని పార్టీల నేతలు అమలు చేస్తున్నారా అన్న సందేహం కనపడుతున్నది. దాడులు, సోదాలు ఉండవు కాబట్టి.. అటు కంపెనీలు, ఇటు కస్టమర్లు అక్రమ మార్గాన్ని అనుసరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల సంఘం అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే గానీ ఇవన్నీ అంత ఈజీగా బయటపడవు.