రిజర్వ్ బ్యాంకు(RBI) తీసుకున్న నిర్ణయంతో EMI కట్టేవారికి చాలా కాలం తర్వాత వెసులుబాటు దక్కనుంది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా రెపోరేటును 6.50% నుంచి 6.25 శాతానికి తగ్గించడంతో లోన్లపై EMIలు కట్టేవారికి ఇక గుడ్ న్యూసే. సుమారు ఐదేళ్ల తర్వాత రెపో రేటు 6.25 శాతానికి చేరుకుంది. మానిటరీ పాలసీ కమిటీ(MPC) నిర్ణయాలను RBI నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు గాను 2020లో రేపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 4% చేసింది. 2022లో ద్రవ్యోల్బణం భయాలతో రేట్ల పెంపు మళ్లీ మొదలైంది.
రెపో రేటు తగ్గింపుతో రుణాల(Loans) వడ్డీ రేట్లు తగ్గి రుణగ్రహీతలకు ఉపశమనం కలగనుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో లోన్లు తీసుకున్నవారికి EMI భారం తగ్గుతుంది. కొత్తగా తీసుకునేవారికి తక్కువ వడ్డీకే లోన్లు దక్కుతాయి. ప్రస్తుతం హోం లోన్ వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.5% నుంచి 9% దాకా ఉన్నాయి. ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు తగ్గడంతో ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం(Liquidity) పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.