చంద్రుడిపై అసాధారణ లోహాలు, ప్రకృతి వనరులున్నాయన్న కోణంలో పంపిన చంద్రయాన్-3.. తన పనిని ప్రారంభించింది. నిన్న సాయంత్రం 6:03 గంటలకు సౌత్ పోల్ పై అడుగుపెట్టిన ల్యాండర్… అక్కణ్నుంచి మరో నాలుగు గంటల తర్వాత బయటకు వచ్చింది. ప్రజ్ఞాన్ రోవర్ ఇక రీసెర్చ్ కి సిద్ధమైంది. ల్యాండింగ్ అయిన ప్రాంతం పరిసరాల్లో సిలికాన్, మెగ్నీషియం, టైటానియంతోపాటు ఇతర లోహాలు ఎంతున్నాయనేది రోవర్ గుర్తించనుంది. ఇలా 14 రోజుల పాటు కంటిన్యూగా ప్రజ్ఞాన్ పనిచేస్తుందని ఇస్రో(ISRO) తెలిపింది. మరోవైపు చంద్రుని దక్షిణ ధ్రువంపై నుంచి బయటకు వచ్చిన తర్వాత రోవర్ నుంచి ఫొటోలు ఇస్రోకి చేరినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించి వాటిని విడుదల చేసింది. జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను రోవర్, ల్యాండర్ పరిశీలిస్తాయని తెలిపింది.
జాతీయ చిహ్నం, ఇస్రో ముద్ర ఇక శాశ్వతం
చదునైన ప్రదేశాన్ని విక్రమ్ ల్యాండర్ ఎంచుకున్న ఫొటోలను ఇస్రో రిలీజ్ చేసింది. అందులో ల్యాండర్ కాళ్లకు సంబంధించిన నీడ(Shadow) కనిపిస్తున్నట్లు ఫొటోల్లో స్పష్టంగా ఉంది. చంద్రుడిపై అడుగుపెట్టిన రోవర్.. జాబిల్లిపై శాశ్వతంగా భారతదేశ ముద్రను వేసింది. ర్యాంప్ నుంచి దిగగానే ప్రజ్ఞాన్ వెనుక చక్రాలపై గల భారత జాతీయ చిహ్నం, ఇస్రో ముద్రలను చందమామపై అద్దింది. నెలరేడుపై గాలి లేనందువల్ల ఈ ముద్రలు(Symbols) శాశ్వతంగా ఉండిపోతాయని ఇస్రో స్పష్టం చేసింది. ఇక నుంచి రోవర్ పంపే ఫొటోల ఆధారంగా శాస్త్రవేత్తల పరిశోధన సాగనుంది. ఇది 14 రోజుల వరకే పనిచేస్తుందా లేక బ్యాటరీని రీఛార్జి చేసుకుని మరికొంత కాలం చంద్రుడిని చుడుతుందా అన్నది వేచి చూడాల్సి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.