టోల్ గేట్ అంటేనే వామ్మో అనుకుంటాం. రానుపోను వాహనాలకు పెద్దమొత్తంలో వసూలు చేస్తున్నా ఫాస్ట్ గా వాటిని దాటి వెళ్లే పరిస్థితి ఉండదు. ఇక పండుగ సమయాల్లోనైతే అంతే సంగతులు. ‘ఫాస్టాగ్’ ఉన్నా చాలా చోట్ల అవి సరిగా పనే చేయవు. కానీ ఇక నుంచి ఆ తిప్పలు తప్పుతాయని కేంద్ర ప్రభుత్వం అంటోంది. టోల్ ప్లాజాల వద్ద అర నిమిషం కూడా వేచి చూడవలసిన అవసరం లేకుండా కొత్త విధానాన్ని(System) తీసుకురానున్నట్లు కేంద్ర, ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ తెలిపారు.
ఇపుడున్న ‘ఫాస్టాగ్’ స్థానంలో ఓపెన్ టోల్ సిస్టమ్ ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. కొత్త టోల్ విధానం వల్ల జర్నీ టైమ్ తగ్గడంతోపాటు కిలోమీటర్ల లెక్కన డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. శాటిలైట్ కెమెరా టెక్నాలజీతో పనిచేసే కొత్త టోల్ విధానం ప్రస్తుతం దిల్లీ-మేరఠ్ ఎక్స్ ప్రెస్ వే లో ‘పైలట్ ప్రాజెక్టుగా’ అమలు చేస్తున్నామన్నారు. ఇది సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల్లో కొత్త సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలియజేశారు.