
అంతకంతకూ పెరిగిపోతున్న హైదరాబాద్ రద్దీ గురించి చెప్పేదేముంటుంది. IT కంపెనీలకు నెలవైన ప్రాంతాల్లో పొద్దున, సాయంత్రం రోడ్లపై వేలాది వాహనాలతో గందరగోళం కనిపిస్తుంది. ఇక చినుకు పడితే అంతే సంగతులు. కిలోమీటరు దూరం పోవాలంటే 10 నుంచి 15 నిమిషాలు పడుతుంటుంది. ఇలాంటి ట్రాఫిక్ జామ్ ను తగ్గించేందుకు సైబరాబాద్ పోలీసులు IT కంపెనీలతో సమావేశం నిర్వహించారు. ‘మరోసారి వర్క్ ఫ్రం హోమ్’ సిస్టమ్ ను పరిశీలించాలని కోరారు. మొన్నటి వర్షాల ఎఫెక్ట్ తో… గత వారంలో అందరూ ఒకేసారి ఇళ్లకు వెళ్లకుండా 3 దశల్లో లాగ్ అవుట్ చేయాలని పోలీసులు సూచించారు. ఇది కూడా సక్సెస్ కాకపోవడంతో ఇక ‘వర్క్ ఫ్రం హోమ్’ ను పరిశీలించాలన్నారు.
IT కంపెనీలతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్(TCS), విప్రో, కాగ్నిజెంట్, డెలాయిట్, జేపీ మోర్గాన్, క్యాప్ జెమినీ వంటి దిగ్గజ కంపెనీలు ఈ సమావేశానికి అటెండ్ అయ్యాయి. సొంతంగా ట్రాన్స్ పోర్టేషన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కంపెనీల ముందు పోలీసులు ఉంచారు. దీనివల్ల వెహికిల్స్ సంఖ్య బాగా తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు. IT ఎంప్లాయిస్ అంతా ఒకేసారి రోడ్లపైకి రాకుండా డ్యూటీ టైమింగ్స్ లో మార్పులు తీసుకువచ్చేలా మీటింగ్ లో చర్చించారు. ‘వర్క్ ఫ్రం హోమ్’ అయితేనే బాగుంటుందని, దాని గురించి పరిశీలన చేయాలని సదరు కంపెనీలను పోలీసులు కోరారు.