యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వ్యవస్థ వల్ల భారతదేశంలో ఆన్ లైన్ లావాదేవీలు ఎంత సరళతరమయ్యాయో(Easy) చూస్తున్నాం. ఫోన్ పే, గూగుల్ పే వంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా బ్యాంకులకు వెళ్లే అవసరమే లేకుండా పోయింది. ఇలాంటివి భారత్ మినహా ఏ దేశంలోనూ కనపడవు. దీనిపై ముచ్చటపడుతున్న ఆసియా(Asian) దేశాలతో పేమెంట్స్ జరిపేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెడీ అయ్యింది.
ఎలా అంటే…
బహుళజాతి ప్రాజెక్టు అయిన నెక్సస్(Nexus)లో భాగంగా దేశీయ ఫాస్ట్ పేమెంట్స్ సిస్టమ్(FPS) ఇంటర్ లింకింగ్ ద్వారా లావాదేవీలు జరుపుతారు. ఇన్ స్టంట్(Instant) క్రాస్-బార్డర్ రిటైల్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్ ఏర్పాటుకు గాను ఈ నెక్సస్ ప్రాజెక్టును ఉపయోగిస్తారు. మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఇండొనేషియా దేశాలతో UPI ట్రాన్జాక్షన్ జరిపేందుకు అమల్లోకి తెస్తారు.
ఇప్పటికే…
భారతీయ UPIతో నెక్సస్ ఇంటర్ లింక్ వ్యవస్థ ఇప్పటికే మలేషియా FPSతో అనుసంధానమై ఉంది. సింగపూర్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ తో వచ్చే ఏడాదికల్లా ఇంటర్ లింకింగ్ పూర్తవుతుంది. ఇండొనేషియా మాత్రం భవిష్యత్తులో ఇందులో జాయిన్ అవనుంది. ఈ క్రాస్-బార్డర్ రిటైల్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్ ద్వారా జరిపే చెల్లింపులు ఫాస్ట్ గా, తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయి. అంతర్జాతీయ సహకారంలో గొప్ప ముందడుగుగా భావించే ఈ ప్రాజెక్టుపై RBI గవర్నర్ శక్తికాంతదాస్ సంతకం చేశారు.