
ఎంతోకాలంగా వెయిటింగ్ కే పరిమితమైన హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో త్వరలోనే పట్టాలెక్కబోతున్నది. పాతబస్తీ మెట్రో రైలు పనులను వెంటనే ప్రారంభించాలని CM ఆదేశించడంతో ఆ ఏర్పాట్లలో నిమగ్నమైంది హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(HRML). నెల రోజుల్లో భూసేకరణకు నోటీసు జారీచేస్తామని మెట్రో రైల్ MD ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. పాతబస్తీ రూట్ లో 5 స్టేషన్లు ఉంటాయని, ఆ దారిలో 103 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయన్న ఆయన.. అందులో నాలుగింటి విషయంలో సమస్యలు వచ్చాయన్నారు. వాటివల్లే గతంలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు నిలిచిపోగా.. ఇప్పుడు వాటిని క్లియర్ చేసి వర్క్స్ స్టార్ట్ చేస్తామన్నారు. MGBS-ఫలక్ నుమా రూట్లో 5.5 కిలోమీటర్ల మేర కన్ స్ట్రక్షన్ వర్క్స్ చేపట్టాల్సి ఉంది.
ఆరేడేళ్లకు మోక్షం
MGBS-ఫలక్ నుమా వరకు పూర్తయితే మెట్రో విస్తీర్ణం 74.7 కిలోమీటర్లకు చేరుకుంటుంది. సుమారు ఆరేడేళ్ల నుంచి ఈ రూట్ నిర్మాణాలు నిలిచిపోయాయి. మజ్లిస్ పార్టీ అభ్యంతరాలతో అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు KCR చొరవ, ఆదేశాలతో ఓల్డ్ సిటీ మెట్రోకు మోక్షం కలగబోతోంది.