గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)కి.. ప్లాట్ల వేలం ద్వారా మరోసారి భారీ ఆదాయం సమకూరింది. ఇప్పటికే కోకాపేట, బుద్వేల్ లో రూ.6 వేల కోట్లకు పైగా దక్కగా… ఇప్పుడు మోకిలలోనూ మంచి డిమాండ్ కనిపించింది. ఈ మూడు రోజుల్లో 180 ప్లాట్లు వేలం వేస్తే మొత్తంగా రూ.387.11 కోట్ల ఆదాయం వచ్చినట్లు GHMC అధికారులు తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో రోజుకు 60 ప్లాట్ల చొప్పున మొత్తం 180 ప్లాట్లను HMDA అమ్మకానికి పెట్టింది. శుక్రవారం నాడు గరిష్ఠంగా గజం రేట్ రూ.76 వేలు రాగా… కనిష్ఠంగా రూ.55 వేలు పలికింది. మళ్లీ ఈ వేలం 28, 29 తేదీల్లో(సోమ, మంగళవారాల్లో) ఉంటుందని GHMC తెలిపింది.
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలలో HMDA లేఅవుట్లలోని ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
165 ఎకరాల్లో ఒక్కోటి 300 గజాల చొప్పున మొత్తం 1,321 ప్లాట్లు అమ్మేందుకు మోకిలలో రెసిడెన్షియల్ లేఅవుట్ తయారు చేసింది HMDA. మూడో రోజు అమ్మకాల ద్వారా రూ.132.97 కోట్లు వచ్చాయి. రెండు ప్లాట్లకు అబ్ నార్మల్ బిడ్స్ రాగా మిగతా 178 ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. HMDAపై ఉన్న నమ్మకం వల్లే కొనుగోళ్లకు పెద్దసంఖ్యలో ముందుకు వస్తున్నారని అధికారులు అంటున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు కాకుండా వ్యక్తిగతంగా ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు వీటిని కొంటున్నారని తెలిపారు.