పండుగల వేళ ప్రయాణికుల్ని ఆకర్షిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్న RTC.. దసరా పండుగ కోసం నగదు బహుమతుల్ని అందజేయనుంది. విజయదశమి కోసం ఊళ్లకు వెళ్లి తిరిగివచ్చే సమయంలో RTC బస్సుల్లోనే జర్నీ ఉండేలా ‘లక్కీ డ్రా(Lucky Draw)’ను అందుబాటులోకి తెచ్చింది. రూ.11 లక్షల మేర నగదు బహుమతుల్ని అందివ్వాలని నిర్ణయించింది. బస్సుల్లో ప్రయాణం(Journey) పూర్తయ్యాక టికెట్ వెనకాల పూర్తి పేరు, ఫోన్ నంబరు రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వాటిని వేయాల్సి ఉంటుంది. ఈ ‘లక్కీ డ్రా’లో గెలుపొందిన వారికి పండుగ తర్వాత బహుమతుల్ని అందజేస్తారు. ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, మరో ఐదుగురు మహిళలకు అంటే ఒక్కో రీజియన్ కు గాను 10 మందికి వీటిని అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 110 మందికి బహుమతులు దక్కనుండగా.. ఒక్కొక్కరికి ప్రైజ్ కింద రూ.9900 చొప్పున అందించబోతున్నట్లు సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు.
జర్నీ ఎప్పట్నుంచి ఎప్పటివరకు…
పండుగల వేళ ఊళ్లకు వెళ్లడం, తిరిగి రావడం వంటి సమయాల్లో ఆర్టీసీని ఉపయోగించుకోవాలన్నది సంస్థ లక్ష్యం. అక్టోబరు 21 నుంచి 23 వరకు… తిరిగి అక్టోబరు 28 నుంచి 30 తేదీల్లో జర్నీ చేసేవారందరూ ఈ ‘లక్కీ డ్రా’లో పాల్గొనవచ్చు. పురుషులు, మహిళలకు విడివిడిగా డ్రాప్ బాక్స్ లు ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. విజేతలకు చీఫ్ గెస్ట్ ల చేతుల మీదుగా ప్రైజ్ లు అందిస్తారు. మొన్నటి రాఖీ పండుగకు సైతం ఇదే రీతిలో 33 మందికి రూ.5.5 లక్షల విలువైన ప్రైజ్ ల్ని అందించారు. బతుకమ్మ, దసరా పర్వదినాల సందర్భంగా పెద్దసంఖ్యలో ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. ఇలాంటి వారందర్నీ తమ బస్సుల్లోనే జర్నీ చేసేలా ఈ ‘లక్కీ డ్రా’ను తీసుకువస్తున్నారు. పూర్తి వివరాలకు 040-6944 0000, 040-2345 0033 నంబర్లను సంప్రదించవచ్చని RTC తెలిపింది.