Published 07 Dec 2023
వరుసగా ఏడు రోజుల(Sessions) పాటు అప్రతిహత లాభాలతో దూసుకుపోయిన సెన్సెక్స్.. ఈ రోజు నష్టాల బాట పట్టింది. విదేశీ పెట్టుబడులు పెరగటం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో బాంబే స్టాక్ ఎక్ఛేంజ్(BSE Sensex), నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ నిఫ్టీ వాటి రికార్డుల్ని అవే బ్రేక్ చేసుకుంటూ ఈ వారం రోజుల పాటు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను చేరుకున్నాయి. కానీ ఈ రోజు మాత్రం ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి. కంటిన్యూగా ఏడు సెషన్లలో లాభాలు నమోదు చేసిన సెన్సెక్స్ ఇవాళ 132 పాయింట్లు కోల్పోయింది. దీంతో ‘సెవెన్ డేస్’ ర్యాలీకి బ్రేక్ పడ్డట్లయింది. రేపు(శుక్రవారం) రెండు నెలల ద్రవ్య పరపతి విధానాన్ని RBI సమీక్షించనుండటంతో మదుపర్లు కొంత అప్రమత్తతతో ఆచితూచి వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
గురువారం పొద్దున 69,694 పాయింట్లతో BSE సూచీ ప్రారంభం కాగా.. మొదట్లో 69,695 పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. కానీ సెన్సెక్స్ ఆ తర్వాత మెల్లమెల్లగా నష్టాల్లోకి వెళ్లిపోయింది. 69,695 పాయింట్ల నుంచి ఒకానొక దశలో 69,320 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరినా చివర్లో కోలుకుని 69,522 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి(Nifty) సూచీ సైతం 36 పాయింట్లు కోల్పోయి 20,901 వద్ద ముగిసింది. మార్కెట్లు క్లోజ్ అయ్యే టైమ్ కు రూపాయి మారకం విలువ డాలర్ తో పోలిస్తే 83.36 వద్ద నిలిచింది. SBI, NTPC, మారుతీ, TCS, HDFC బ్యాంకు వంటి 12 షేర్లు లాభాల బాట పట్టాయి. ఇన్ఫోసిస్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ICICI బ్యాంకు సహా 10 షేర్లు నష్టపోయిన లిస్ట్ లో చేరాయి.