
Published 20 Dec 2023
ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు(Stock Markets) మధ్యాహ్నం వరకు అదే తీరును కనబర్చాయి. కానీ కేవలం మూడు గంటల వ్యవధిలోనే పరిస్థితి మొత్తం తారుమారైంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. గత 10 నెలల్లో ఎన్నడూ లేనంతగా అతిపెద్ద నష్టాన్ని మూటగట్టుకున్నాయి. ఒకట్రెండు మినహా అన్ని షేర్లు కుప్పకూలడంతో సంపదంతా ఆవిరైంది. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 302 పాయింట్ల మేర నష్టపోయాయి. పొద్దున 72,000 పాయింట్లను తాకిన సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత 1,000 పాయింట్లు కోల్పోయి 71,000 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న ముడిచమురు ధరల ప్రభావం, ఎర్ర సముద్రంలో నౌకల దాడి వంటివి స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. గత కొన్ని రోజులుగా కంటిన్యూగా లాభాల బాట సాగడం కూడా ఈ రోజు ప్రతికూలతలకు కారణంగా నిలిచింది. వారం రోజుల క్రితం వరుసగా ఏడు రోజుల పాటు స్టాక్ మార్కెట్లు రోజురోజుకూ వృద్ధిని నమోదు చేస్తూ లాభాల బాటలో నడిచాయి.
నిఫ్టీ సైతం అదే బాటలో…
నిఫ్టీ సైతం 21,500 వద్ద ప్రారంభమై 21,150 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంగా 320 పాయింట్లు కోల్పోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83 వద్ద ముగిసింది. టాటా మోటార్స్, టాటా స్టీల్, NTPC, SBI, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా వంటి కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. ఒక్క HDFC బ్యాంక్ మాత్రమే లాభాలు మూటగట్టుకుంది.