స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. పొద్దున 11 గంటల నుంచి నష్టాల బాటలో కొనసాగుతున్న మార్కెట్లు సాయంత్రం అదే తీరుగా ముగిశాయి. సెన్సెక్స్ 906 పాయింట్ల మేర కోల్పోయి 72,761.89 వద్ద క్లోజ్ అయింది. అటు నిఫ్టీ(Nifty) సైతం 338 నష్టపోయి 21,997.70 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకానొక దశలో BSE సెన్సెక్స్ 1,100 పాయింట్ల మేర కోల్పోయింది. 2022 డిసెంబరు తర్వాత ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
లాభాల్లో మొదలైనా…
దేశీయ మార్కెట్ సూచీలు పొద్దున లాభాలతో ప్రారంభమైనా ఒక్కసారిగా నష్టాల్లో(Down)కి జారుకోవడం మొదలైంది. రూ.374 లక్షల కోట్ల మార్కెట్ మొత్తం క్యాపిటలైజేషన్ లో ఈ ఒక్కరోజే రూ.12 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో BSE స్మాల్ క్యాప్ సూచీ 5 శాతం, మిడ్ క్యాప్ సూచీ 4 శాతం చొప్పున కోల్పోవాల్సి వచ్చింది. స్టాక్ మార్కెట్లలో చిన్న, మధ్యస్థాయి కంపెనీల షేర్లు ఇష్టమొచ్చినట్లు పెరుగుతూ వస్తున్నాయని, అవి ఏ మాత్రం కరెక్ట్ గా అనిపించడం లేదని ఈ మధ్యే సెబీ ఛైర్ పర్సన్ అన్నారు. ఈ కామెంట్స్ కూడా అమ్మకాల ఒత్తిడిపై ప్రభావం చూపాయి.