ఉద్యోగుల పని వేళల అంశం దేశంలో మరోసారి చర్చగా మారింది. వారానికి 70 గంటలు పనిచేయాల్సిందేనంటూ ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అంటే ఇప్పుడు ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రమణ్యం ఏకంగా 90 గంటలు ఉండాలని చెప్పడం రచ్చకు దారితీసింది. దీనిపై ఉద్యోగులతోపాటు సెలబ్రిటీలు ఫైర్ అవుతున్నారు. ప్రపంచంలోని ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మంది నిర్ణీత పని గంటల కంటే ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారని ఓ అధ్యయనం చెప్పింది. దీనివల్ల గుండె సమస్యలు ఏర్పడి ప్రాణాంతకంగా మార్చుతున్నాయని తెలిపింది. కరోనా టైంలో ఇంటి నుంచే పనిచేస్తూ(Work From Home) గంటలపాటు కంప్యూటర్లకే అతుక్కుపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారట. సంస్థలు, ఉద్యోగులు ఆలోచించి పని గంటలు తగ్గించుకుంటేనే బెటరని, తద్వారా ఆరోగ్య సమస్యలు రాకుండా పని ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తేలింది.
వారానికి 90 గంటలంటే ఏడు రోజుల పాటు 13 గంటల చొప్పున పనిచేయాలి. మిగిలిన 11 గంటల్లోనే నిద్ర, కుటుంబం, ఇతర పనులు, ప్రయాణాలు. ఇది శారీరకంగానే కాదు మానసికంగానూ ప్రభావం చూపనుండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం వారానికి 55 గంటల పనే ఉండాలట. అది మించితే మూడో వంతు ఉద్యోగులు హార్ట్ స్ట్రోక్ బారిన పడతారట. ఎక్కువ పనివల్ల BP, డయాబెటిస్ తోపాటు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వచ్చి హార్ట్ ఫెయిలయ్యే ప్రమాదముందట. మహిళలు 50 గంటలు, పురుషులు 55 గంటలకు మించి పనిచేస్తే శరీరంలో కొవ్వు స్థాయి పెరగడంతో మనిషి జీవితకాలంపై ప్రభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
వాళ్లిద్దరూ ఏమన్నారంటే…
నారాయణమూర్తి…: (ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో ప్రొడక్టివిటీ ఎక్కువ కాబట్టి మరిన్ని గంటలు శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ ఎలా కష్టపడ్డాయో మనమూ అలాగే చేయాలి. అభివృద్ధిలో పోటీపడాలంటే యువత 70 గంటలు పనిచేయాలి. దేశంలో 80 కోట్ల మంది రేషన్ తీసుకుంటున్నారంటే వారంతా పేదరికంలో ఉన్నట్లే. 70 గంటలు పనిచేయకపోతే దాన్ని అధిగమించలేం).
సుబ్రమణ్యం…: (ఆదివారాలు మీతో పనిచేయించకపోవడంతో చింతిస్తున్నా. నేను ఆదివారాలు పనిచేస్తున్నా, అయినా ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ, ఆఫీసులో ఎక్కువ టైం ఉంటామని భార్యలకు చెప్పాలి. వారానికి 90 గంటలు పనిచేయడానికి ఆదివారం సెలవులనూ వదిలేయాలి).