త్వరలోనే దేశీయ iPhones అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ప్రముఖ దిగ్గజ కంపెనీ టాటా గ్రూపు(Tata Group).. ఐఫోన్ల తయారీ చేపట్టనుంది. అది కార్యరూపం దాల్చితే ఆగస్టులో ఒప్పందాలు పూర్తి కానున్నాయి. తైవాన్ కు చెందిన విస్ట్రన్ కార్ప్ కొనుగోలుకు టాటాలు జరుపుతున్న చర్చలు కొలిక్కి వచ్చే దిశగా సాగుతున్నాయి. విస్ట్రన్ కార్ప్ ప్రస్తుతం కర్ణాటక కేంద్రంగా ఐఫోన్లు తయారు చేస్తోంది. ఐఫోన్ల తయారీ రంగంలోకి దిగాలని భావించిన టాటా గ్రూప్… ఏడాది పాటు విస్ట్రన్ కార్ప్ తో చర్చలు జరిపింది. 600 మిలియన్ డాలర్లకు విస్ట్రన్ కార్ప్ యూనిట్ కొనేందుకు టాటా సిద్ధమైంది.
తొలుత విస్ట్రన్ కార్ప్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తారని అనుకున్నా… దాన్ని పూర్తిగా కొనడానికే రెడీ అయ్యారు. ఈ కంపెనీ కొనుగోలు పూర్తయితే తొలిసారిగా దేశీయ ఐఫోన్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా మొబైల్ మార్కెట్ లో టాటా కంపెనీ తన ప్రతిష్ఠను మరింత పెంచుకోనుంది.