రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను చెల్లించే అవసరం లేదంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యతరగతి(Middle Class)కి ఉపశమనం కలిగించేలా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా కారణాలున్నాయి. పన్ను తగ్గింపు అంశం దేశ ఆర్థిక వృద్ధిని పెద్దయెత్తున పెంచే అవకాశముంది. శ్లాబులను తగ్గించడం ద్వారా పన్ను చెల్లింపుదారులపై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం.
డిస్పోజబుల్ ఇన్ కం…
ఖర్చులన్నీ పోగా మిగిలే ఆదాయాన్ని ‘డిస్పోజబుల్ ఇన్ కం’ అంటారు. పన్ను రేట్లను తగ్గించడం ద్వారా ప్రజల వద్ద నిల్వ పెరుగుతుంది. దీంతో ఖర్చులు, పొదుపు, పెట్టుబడుల కోసం ముందుకు రావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు(Financial Sources) పెరుగుతాయి. మధ్యతరగతిపై భారాన్ని తగ్గించడం ద్వారా జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితి మెరుగవుతాయి. ఈ మిగులు ఆదాయంతో వ్యాపారాలతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పోటెత్తుతాయి. ముఖ్యంగా డిస్పోజబుల్ ఆదాయాన్ని అధికంగా గృహ వినియోగానికే వెచ్చిస్తారన్న అంచనాలున్నాయి. ప్రజల చేతుల్లో డబ్బు ఎక్కువ ఉండటం ద్వారా వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. ఆ కారణంతో వ్యాపారాలు మరింత పంజుకుంటాయని విశ్లేషకులు అంటున్నారు.