మొబైల్ ఛార్జీలు ఇష్టమొచ్చినట్లు పెంచేసి సామాన్యులకు భారంగా తయారైన కంపెనీలకు… టెలికాం నియంత్రణ సంస్థ(TRAI) దిమ్మదిరిగే షాకిచ్చింది. సరైన సిగ్నల్ లేకుండా సర్వీసు అందించే ఆపరేటర్లకు భారీగా ఫైన్ విధించనుంది. వినియోగదారుల(Customers)కు నాణ్యత(Quality)తో సేవలు అందించేందుకు కఠిన నిబంధనలు తీసుకువచ్చింది.
అవేంటంటే…
కొత్త రూల్స్ ప్రకారం జిల్లా స్థాయి నెట్ వర్కుల్లో అంతరాయాలు ఏర్పడితే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు రిబేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రీ-పెయిడ్ వినియోగదారులకైతే కనెక్షన్ చెల్లుబాటు గడువు పెంచాలి. 24 గంటలకు పైగా అంతరాయం మించిన పక్షంలో సర్వీస్ ప్రొవైడర్లు చెల్లించే ఛార్జీలపై కొంత మేర రిబేట్ ఇవ్వాలి. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఆ బిల్లింగ్ ను బిల్ సైకిల్లో చూపించాల్సి ఉంటుంది.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే కంపెనీలకు మినహాయింపు ఉంటుంది. మిగతా సమయాల్లో ఫైన్ గా రూ.10 లక్షల వరకు విధించే వెసులుబాటు తెచ్చింది. దీనిపై జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ సహా COAI(సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) వాటిపై గుర్రుగా ఉన్నాయి. ఇలా అయితే కష్టమంటూ తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నాయి. ఆరు నెలల్లో ఈ రూల్స్ అందుబాటులోకి వస్తాయి.