తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ.. ఎన్నికల ముందు మహబూబ్ నగర్లో నిర్వహించిన పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రకటించారు. ఆ మేరకు ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు కాగా, ఛైర్మన్ గా పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీగా పసుపు(Turmeric) సాగవుతోంది. పసుపుతోపాటు అన్నిరకాల సుగంధ ద్రవ్యాలు కలిపి 1987లో సుగంధ ద్రవ్యాల బోర్డు కేరళ కొచ్చిలో ఏర్పాటైంది. రైతుల ప్రయోజనాలు, పరిశోధన, గిట్టుబాటు ధరల్ని ఈ బోర్డు పరిశీలిస్తుంది. 2010లో వరంగల్, గుంటూరు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, సిక్కిం, గువాహటిల్లో ప్రాంతీయ(Regional) కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వాటికి 16 జోనల్ ఆఫీసులు, 13 మార్కెటింగ్ కార్యాలయాలుండగా.. 52 రకాల ఉత్పత్తుల్ని పర్యవేక్షిస్తున్నాయి.
ఉత్పత్తి, ప్రమోషన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ కోసం బోర్డు ఏర్పాటైతే.. 2022 ఫిబ్రవరి 26 నాటికి 35 వసంతాలు పూర్తి చేసుకుంది. దేశంలో సాగయ్యే పసుపులో నిజామాబాద్ ప్రాంతం నుంచే 70 శాతం ప్రొడక్షన్ ఉండటంతో బోర్డు కోసం డిమాండ్లు వచ్చాయి. టీ బోర్డు, పొగాకు బోర్డు మాదిరిగా పసుపు బోర్డు ఉంటే ఎంతో మేలు. లేదంటే ప్రతిదానికీ కొచ్చిలోని బోర్డుపైనే ఆధారపడాలి. 2017 ఆగస్టులో పసుపు బోర్డు కోసం అప్పటి MP కల్వకుంట్ల కవిత మోదీని కలవగా.. 2018లో స్పైసెస్ డెవలప్మెంట్ పార్కును సురేశ్ ప్రభు ప్రకటించారు. అప్పట్నుంచి ఇది ఎన్నికల ప్రచారంగా మారగా.. ఆనాటి MP కవితకు వ్యతిరేకంగా 178 మంది రైతులు నామినేషన్లు వేశారు. 2020 జనవరిలో ఇందూరులో స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీసు ఏర్పాటవగా.. పసుపు, మిరప పంటల పర్యవేక్షణ జరుగుతోంది.