నిత్యం పెరుగుతున్న టమాట ధరలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రేట్లకు కళ్లెం వేసే చర్యలకు శ్రీకారం చుట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేజీ ధర రూ.150 నుంచి రూ.180 ఉంటే… ఉత్తరాది రాష్ట్రాల్లో అది రూ.250 దాటిపోయింది. మొన్నటి ఎండల ప్రభావానికి చాలా రాష్ట్రాల్లో పంట సాగు తగ్గిపోవడమే ప్రధాన కారణమని గుర్తించిన మోదీ సర్కారు.. ఇప్పుడు దిద్దుబాటు చర్యలపై దృష్టిపెట్టింది. టమాట ఎక్కువగా సాగయ్యే మూడు రాష్ట్రాల నుంచి పంట సేకరించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాట సేకరించి మిగతా రాష్ట్రాలకు సరఫరా చేయాలని చూస్తోంది. రేట్లు ఎక్కువగా ప్రాంతాలను గుర్తించి తొలి దశలో అక్కడకు టమాటను ట్రాన్స్ పోర్ట్ చేయాలని నిర్ణయించింది. ధరలు సాధారణ స్థితికి రావాలంటే మరిన్ని రాష్ట్రాల్లో పంట చేతికి రావాల్సి ఉంది.