అమెరికా-రష్యాకు చెందిన ఐదో తరం(5th Generation) స్టెల్త్ ఫైటర్లు తొలిసారి ఎదురుపడ్డాయి. అదేదో ప్రత్యక్షమో, ప్రచ్ఛన్న యుద్ధమో అనుకునేరు. ఈ రెండింటి కలయిక మన భారత్ లోనే కావడం విశేషం. ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ‘ఏరో ఇండియా’లో భాగంగా ఈ రెండూ కనిపించాయి. బెంగళూరు యెలహంక ఎయిర్ బేస్ లో షో జరుగుతోంది. రష్యన్ స్యూ-57, అమెరికన్ F-35 విమానాలు ఆకాశానికి చిల్లులు పడ్డట్లుగా భీకర శబ్దాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ రెండు దేశాలు ఒకేచోట ప్రదర్శన ఇవ్వడాన్ని ప్రపంచ రక్షణ(Defence) రంగంలో గొప్ప ముందడుగుగా నిపుణులు పోలుస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఇవి షోలు ఇస్తాయి.
ఈ జెట్లు గాల్లో విహరిస్తున్న వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఢీ అంటే ఢీ అన్నట్లుండే రెండు దేశాల్ని కలపడం ఒక్క భారత్ కే సాధ్యమంటూ పోస్టులు పెడుతున్నారు. భారత్ ఐదో జనరేషన్ కు చెందిన AMCA(అడ్వాన్సుడ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్)ను సైతం తొలిసారి ప్రదర్శనకు ఉంచారు. LCA తేజస్ ను తయారు చేసిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడే ఈ AMCAకు రూపకల్పన చేసింది. దీనికి ఈ మధ్యనే కేబినెట్ కమిటీ ఆమోదం తెలపడంతో.. 2035లో ఇది సైన్యానికి అందుతుంది.