దేశవ్యాప్తంగా వివాహాల(Wedding) సీజన్ మొదలవబోతున్నది. నవంబరు, డిసెంబరు నెలల్లో 18 రోజులు ముహూర్తాలు ఉండగా.. భారీస్థాయిలో ఖర్చు చేయబోతున్నట్లు కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) అంచనా వేసింది. నవంబరు 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29తోపాటు డిసెంబరు 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో సుముహూర్తాలున్నట్లు తెలిపింది.
ఈ ముహూర్తాల్లో 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని, ఇందుకోసం రూ. 5.9 లక్షల కోట్లు ఖర్చు కానున్నట్లు CAIT చెబుతున్నది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మైలురాయి కాగా.. దేశ రాజధాని ఢిల్లీలోనే 4.5 లక్షల వివాహాల కోసం రూ.1.5 లక్షల కోట్లు వెచ్చించబోతున్నారట. గతేడాది 35 లక్షల పెళ్లిళ్లకు రూ.4.25 లక్షల కోట్లు వెచ్చించగా.. 2023 ఇదే సీజన్లో 11 రోజులే ముహూర్తాలుండగా, ఈసారి 18 రోజులున్నాయి. దేశంలో జనవరి-జులై మధ్యకాలంలో తొలి సీజన్ గా.. నవంబరు-డిసెంబరును రెండో సీజన్ గా భావిస్తారు.