
రాష్ట్రం ఏర్పడ్డ సమయమైన 2014లో మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ 2023 కల్లా దారుణమైన అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని రేవంత్ సర్కారు తెలిపింది. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, అప్పులపై అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Sessions) శ్వేత పత్రం(White Paper) విడుదల చేశారు. బడ్జెటేతర రుణాలు పేరుకుపోవడం వల్లే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు ఆయన 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రం మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లుగా ఉందని, 2014-15 నాటికి రుణం కేవలం రూ.72,658 కోట్లని స్పష్టం చేశారు. 2014-2022 మధ్య యావరేజ్ గా 24.5 శాతం అప్పు పెరిగిందని, 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు అని శ్వేతపత్రం ద్వారా తెలియజేశారు. 2015-16 రుణ శాతం, GSDP కలిపి 15.7 శాతంతో ఉన్న తెలంగాణ 2023-24 నాటికి 27.8 శాతానికి పెరిగిందని.. ఎనిమిదేళ్ల క్రితం దేశంలో అత్యల్ప రుణ శాతం కలిగిన రాష్ట్రం ఇప్పుడు చాలా రాష్ట్రాలను మించిపోయిందని వివరించారు. 57 సంవత్సరాల్లో అభివృద్ధి కోసం రూ.4.98 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్ల అప్పులు పెరిగాయని శ్వేత పత్రంలో పొందుపరిచారు.
ప్రభుత్వ పథకాలకు ఎలా…
రాష్ట్ర అప్పుల పరిస్థితే ఇలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిన పథకాలకు నిధులు ఎక్కణ్నుంచి సమీకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారిందన్న మాటలు వినపడుతున్నాయి.
రుణాలు ఇలా… (రూపాయల్లో)…
FRBM(Fiscal Responsibility And Budget Management) | 3,89,673 కోట్లు |
గ్యారంటీతో సర్కారు చెల్లించే SPVల రుణాలు | 1,27,208 కోట్లు |
ప్రభుత్వ హామీతో SPVల రుణ బకాయిలు | 95,462 కోట్లు |
ప్రభుత్వ హామీ లేని రుణాలు | 59,414 కోట్లు |
మొత్తం అప్పులు | 6,71,757 కోట్లు |