బడి పిల్లల యూనిఫామ్స్ అంటే ఎంతటి నిర్లక్ష్యం ఉంటుందో చూశాం. పాఠశాలలు(Schools) ప్రారంభమయ్యే లోపే వాటిని అందజేయాల్సి ఉన్నా విద్యా సంవత్సరం ముగిసే సరికి కూడా వాటిని కుట్టివ్వలేని దుస్థితి ఉంటుంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం, కాంట్రాక్టర్లు సరిగా పట్టించుకోకపోవడం వంటి కారణాలతో యూనిఫామ్స్ లేకుండానే పిల్లలు పై తరగతులకు వెళ్తుండేవారు. కానీ అలాంటి వాటికి చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మహిళామణులకు…
మహిళా సంఘాలకు కీలక బాధ్యతలు కట్టబెట్టాలన్న ఆలోచనతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. విద్యార్థుల ఏకరూప దుస్తుల(Uniforms)ను కుట్టి ఇచ్చే పనుల్ని మహిళామణులకు అప్పగించింది. నిర్ణయం తీసుకోవడమే కాదు ఏకంగా జీవోనే జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గల పిల్లలందరికీ డ్రెస్ లు అందించేందుకు గాను 28,200 మహిళా సంఘాలకు బాధ్యతలు కట్టబెట్టింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ GO జారీ చేసింది.
ఆలోపునే ఇవ్వాలి…
విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా కేవలం 45 రోజుల్లోనే వాటిని అందివ్వాలంటూ ఆదేశాల్లో పంచాయతీరాజ్ శాఖ తెలియజేసింది. మొత్తంగా రాష్ట్రంలోని పిల్లలకు 63.44 లక్షల డ్రెస్ లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.