ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. స్వామి వారి ఆదాయం సైతం అంతకంతకూ రెట్టింపవుతోంది. గత 28 రోజులకు సంబంధించిన ఆదాయాన్ని లెక్కించగా.. రూ.2.56 కోట్లు సమకూరింది. 250 గ్రాముల బంగారం, 6 కిలోల వెండిని కానుకల రూపంలో స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించారు. వివిధ దేశాల కరెన్సీల్లోనూ దేవస్థానానికి పెద్దయెత్తున ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. 888 అమెరికా డాలర్లు, 130 UAE దిర్హామ్స్, 50 ఇంగ్లండ్ పౌండ్లతోపాటు ఖతార్, కెనడా, మలేషియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, ఒమన్ లాంటి దేశాల కరెన్సీని దేవుడి హుండీల్లో వేశారు.
దేవస్థానం ఉన్నతాధికారుల సమక్షంలో భారీ భద్రత నడుమ స్వామి వారి హుండీల్ని లెక్కించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత క్షేత్రానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా వారాంతాల్లో స్వామి వారి దర్శనానికి పెద్దయెత్తున క్యూ ఉంటోంది. దేవదేవుణ్ని దర్శనం చేసుకునేందుకు నాలుగైదు గంటల పాటు క్యూలో ఉంటున్నారు. ఇలా క్రమంగా పెరుగుతున్న భక్తులతో ఆదాయం సైతం అదే రీతిన పెరుగుతూ పోతున్నది.