సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్(RTC X ROAD) లోని సంధ్య థియేటర్లో ఈ నెల 4న జరిగిన తొక్కిసలాటలో వివాహిత ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలయ్యారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తమ అభిమాన నటుణ్ని చూసేందుకు పెద్దయెత్తున జనం తరలివచ్చారు. అభిమానుల్ని అదుపు చేసే పరిస్థితి లేకపోవడంతో పెద్ద తొక్కిసలాట జరిగింది. అయితే థియేటర్ కు వచ్చే సమయంలో ముందస్తుగా మూవీ టీం కానీ, థియేటర్ మేనేజ్మెంట్ సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. దీంతో అల్లు అర్జున్ తోపాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. అల్లు అర్జున్ ను ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు.
అల్లు అర్జున్ ను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకోగా, పోలీసు వాహనంలో ఆయన్ను తరలించారు. సంధ్య థియేటర్ యజమాని(Owner)తోపాటు మేనేజర్ ను తొలుత అరెస్టు చేశాక, ఆ తర్వాత FIRలో అర్జున్ పేరును నమోదు చేశారు. తొక్కిసలాటకు కారణమై వ్యక్తి ప్రాణాలు కోల్పోయేలా వ్యవహరించారంటూ ఆయనపై కేసు ఫైల్ అయింది. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నామని, ఇకనుంచి వాటికి పర్మిషన్ ఇవ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.