సినీ నటుడు అల్లు అర్జున్ మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ప్రతి ఆదివారం ఠాణా(Police Station)లో హాజరు కావాలంటూ నిన్న నాంపల్లి కోర్టు ఆదేశించడంతో ఆయన చిక్కడపల్లి PSకు వెళ్లారు. అర్జున్ రాక సందర్భంగా స్టేషన్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు… పోలీసులు ఎప్పుడు అడిగినా విచారణకు హాజరు కావాల్సిందేనంటూ ఆదేశాలిచ్చింది. ఆ మేరకు PSకు వచ్చి సంతకం చేసిన అనంతరం అక్కణ్నుంచి వెళ్లిపోయారు. మొత్తంగా 10 నిమిషాల పాటు ఆయన అక్కడ ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అక్కణ్నుంచి కిమ్స్ కు వెళ్తారన్న ప్రచారంతో రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్పిటల్ కు రావొద్దంటూ నోటీసుల్ని అర్జున్ మేనేజర్ కు అందజేశారు. ఒకవేళ తమ మాట కాదని అక్కడకు వస్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు కరాఖండీగా చెప్పేశారు.