అల్లు అర్జున్ కేసులో ఈ రోజు ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఆయన్ను అరెస్టు చేయడం ఒకెత్తయితే అసలు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా అన్నదే పెద్ద డౌట్ గా తయారైంది. టెన్షన్ ఎలా కంటిన్యూ అయిందంటే…
కేసును విచారణకు స్వీకరించాలంటూ అల్లు తరఫు న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. మధ్యాహ్నం విచారించే ఈ పిటిషన్ ను వాస్తవంగా ఉదయం పదిన్నర లోపే వేయాలి. కానీ పగలు పిటిషన్ దాఖలు చేయడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనిపై అభ్యంతరం తెలిపారు. అసలే శుక్రవారం కావడంతో ఇక సోమవారమే తదుపరి విచారణ అన్న మాటలు వినపడ్డాయి. దీంతో ఆయన ఇక జైలులోనే మూడు రోజులు గడపడం ఖాయమన్న వార్తలు షికారు చేశాయి. కానీ అనూహ్యంగా హైకోర్టు కేసును విచారణకు స్వీకరించింది.
అత్యవసర విచారణ జరిపితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, సెలబ్రిటీ అంశం కాబట్టి అలా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుందని PP… కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఆయన సెలబ్రిటీ అన్న కోణంలో విచారణకు స్వీకరించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చినా భద్రతను ఇవ్వలేదంటూ ఆయన తరఫు లాయర్ వాదించారు. గతంలో బండి సంజయ్ ను అరెస్టు చేసినప్పుడు కూడా స్థానిక కోర్టు రిమాండ్ విధించినా, పైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో షారుక్ ఖాన్ సైతం ముంబయి నుంచి ఢిల్లీ వరకు ప్రమోషన్ షో నిర్వహించిన టైంలో ఇలాంటి ఘటనే జరిగిందని, అప్పుడు నమోదైన కేసును తప్పుబట్టిన గుజరాత్ హైకోర్టు.. షారుక్ కు బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు.
బెయిల్ కోసం మరో పిటిషన్ వేసుకోవాలి గానీ క్వాష్ పిటిషన్లో ఎక్కడా బెయిల్ ప్రస్తావన లేదంటూ PP మరోసారి అభ్యంతరం తెలిపారు. క్వాష్ అంటే కేసు కొట్టివేయడమే కానీ బెయిల్ ప్రస్తావన అందులో లేదన్నది PP వాదన. కానీ వీటన్నింటినీ తోసిపుచ్చిన అర్జున్ న్యాయవాది.. గత తీర్పుల్ని ప్రస్తావిస్తూ కోర్టు ఎదుట సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ఆయన బెయిల్ పై సందిగ్ధం నెలకొన్న వేళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.