కమర్షియల్ మూవీ తీసి కావాలని పాత్ర క్రియేట్ చేయడం ద్వారా తనపై కక్ష తీసుకోవాలని చూశారంటూ ‘బ్రో’ సినిమాను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కల్యాణ్ పై తాను కూడా బయోపిక్ తీస్తానని చెప్పారు. సినిమా రంగంలో హీరోగా వెలిగి, మూణ్నాలుగు పెళ్లిళ్లు చేసుకుని పాలిటిక్స్ కు వచ్చిన వ్యక్తి కథతో సినిమా తీయాలని ఉందని అన్నారు. ‘బ్రో’ లాగా ‘మ్రో (మ్యారేజెస్, రిలేషన్స్, అఫెండర్స్)’ ఇలాంటి పేర్లు పెట్టాలనుకుంటున్నాం… ‘బహు భార్య ప్రవీణుడు’, ‘తాళి-ఎగతాళి’, ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు’, ‘నిత్య పెళ్లికొడుకు’, ‘పెళ్లిళ్లు-పెటాకులు’, ఇలాంటి టైటిల్స్ అనుకుంటున్నాం.. పేరు పెట్టిన తర్వాత అందరికీ చెబుతాం.. సినిమా వర్క్ మొదలైందని యాక్టర్స్ కోసం సంప్రదింపులు జరుపుతున్నామని’ అన్నారు.
‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు అని కాకుండా రాంబాబు అని పెట్టుకున్నా బాధపడేవాడిని కానన్నారు అంబటి. ఆసక్తి ఉన్నవారు మంచి టైటిల్ సూచించినా పరిశీలిస్తామని ప్రజాదరణ తమకు అత్యంత ముఖ్యమన్నారు. ‘అసలే ఎన్నికలు వస్తున్నాయి.. సాధ్యమైనంత తొందరగా సినిమా పూర్తి చేస్తాం.. వారాహి అమ్మవారిని కించపరిచేలా వెహికిల్ పేరు పెట్టుకోవడంతోనే పవన్ పతనం మొదలైందని’ ఫైర్ అయ్యారు. ‘బ్రో’ సినిమాకు పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ కూడా తిరిగి రాదని రాంబాబు విమర్శించారు.