నవీన్ పొలిశెట్టి, అనుష్క నటించిన ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఈ నెల 7న రిలీజ్ కు సిద్ధమైంది. మహేశ్ బాబు.పి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్ టైయినర్ గా ఆడియన్స్ ముందుకు వస్తున్నది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వల్ల సినిమా రిలీజ్ ను పలు మార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మూవీకి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు హీరో నవీన్ తెలిపారు. సినిమా ప్రమోషన్ ను అమెరికాలోనూ చేయాలని నిర్ణయించామన్నారు. ‘జాతిరత్నాలు’కు మంచి మార్కులు రావడంతో దాని తర్వాత నవీన్ యాక్ట్ చేసింది ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ కావడంతో ఆయన అభిమానుల్లో ఇంట్రెస్టింగ్ ఏర్పడింది. అనుష్క నటించడం ఈ సినిమాకు ప్లస్ అవుతుందని మూవీ యూనిట్ అంటున్నది. జయసుధ, నాజర్, మురళీశర్మ, తులసి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
హైదరాబాద్ కు చెందిన కమెడియన్ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్.. చెఫ్ అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లో అనుష్క నటించారు. లండన్ లో నివసించే అన్వితకు ప్రేమలు, పెళ్లిళ్లు అంటే పెద్దగా ఇంట్రస్ట్ ఉండకపోగా సింగిల్ గా ఉండటానికే ఇష్టపడుతుంది. అలాంటి ఆమె IVF ద్వారా బిడ్డను కనాలనుకుంటుంది. అందుకు లండన్ లో డోనర్ దొరక్కపోవడంతో హైదరాబాద్ వచ్చేస్తుంది. ఆ టైమ్ లోనే సిద్ధు పర్ఫార్మెన్స్ ఇస్తున్న షోకు అన్విత వెళ్లడం, కామెడీ టచ్ తో ఆయన ఇచ్చిన రిలేషన్ షిప్స్ పై ఆమెకు మంచి ఫీలింగ్ కలగడంతో ఇద్దరి మధ్య పరిచయానికి దారి తీస్తుంది. దీంతో సిద్ధు ఆమె ప్రేమలో పడతాడు. కానీ దీన్ని అన్విత తిరస్కరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ట్విస్ట్ మధ్య సాగే సినిమాలో చూడాల్సిందే అంటోంది మూవీ యూనిట్.
‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ని UV క్రియేషన్స్ బ్యానర్ పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. 2021 మార్చిలో షూటింగ్ మొదలైన ఈ సినిమాలో అనుష్క పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుందని ప్రొడ్యూసర్స్ అంటున్నారు. 40 ఏళ్ల మహిళ, 25 సంవత్సరాల యువకుడితో సాగించే ప్రేమాయణమే ఈ సినిమా అసలు కథ. ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క మెయిన్ లీడ్ లో నటిస్తున్న మూవీ ఇదే.