ప్రముఖ సినీ నటుడు సోనూసూద్(Sonu Sood)ను అరెస్టు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అతణ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చాలంటూ పంజాబ్ లోని లూథియానా కోర్టు ఆదేశించింది. మోసం(Cheating) కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. మోహిత్ శుక్లా అనే వ్యక్తి తనకు రూ.10 లక్షలు మోసం చేశాడంటూ రాజేశ్ ఖన్నా అనే న్యాయవాది కేసు పెట్టారు. ఒక సంస్థలో పెట్టుబడి పెట్టించేందుకు సోనూసూద్ ను సాక్షిగా చూపించారన్నారు. విచారణ తర్వాత ఆయనకు పలుసార్లు సమన్లు పంపినా హాజరు కాలేదు.
దీంతో ఈ సినీ నటుణ్ని అరెస్టు చేసి తమ ఎదుట హాజరుపర్చాలంటూ లూథియానా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రమణ్ ప్రీత్ కౌర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ముంబయి పశ్చిమ అంధేరీలోని ఓషియారా పోలీస్ స్టేషన్ కు అరెస్టు వారెంట్ వెళ్లింది. ఈనెల 10న మరోసారి ఈ కేసు విచారణ జరగనుంది. తెలుగు సహా బాలీవుడ్ లోనూ మంచి నటుడిగా సోనూసూద్ గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా కాలంలో సేవా కార్యక్రమాల ద్వారా వార్తల్లో నిలిచారు.