రెజ్లింగ్ కథాంశం(Story Line)తో వచ్చి ఫిలింఫేర్ పురస్కారాల్లో నాలుగింటిని కొల్లగొట్టి 2016లో బాలీవుడ్ కు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘దంగల్’. వాల్ట్ డిస్నీ కంపెనీ వంటి ప్రఖ్యాత సంస్థ ఆధ్వర్యంలో అమీర్ ఖాన్ నటించి, నిర్మించిన ఈ మూవీ… సినీ విమర్శకుల(Cine Critics) నుంచి ప్రశంసలు అందుకుంది. భారత మహిళా రెజ్లర్లపై నితీశ్ కుమార్ డైరెక్షన్ లో బయోగ్రఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘దంగల్’లో.. బబిత ఫొగాట్ గా నటించిన చిన్నది సుహానీ భట్నాగర్. అమీర్ తో పోటాపోటీగా నటించి చిన్న వయసులోనే అందరి ప్రశంసలు అందుకున్న ఆ అమ్మాయి… ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. 19 ఏళ్ల వయసులోనే పరలోకాలకు చేరుకోవడం బాలీవుడ్ ను వేదనలో ముంచేసింది.
అనారోగ్యంతోనే…
సుహానీ భట్నాగర్ కొంతకాలంగా అనారోగ్యం(Illness)తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. న్యూఢిల్లీలోని AIIMSలో చికిత్స పొందుతుండగానే అర్థంతరంగా తనువు చాలించారు. ఔషధాల(Medicine) రియాక్షన్ వల్ల అనారోగ్యానికి గురైన సుహానీ… గత కొద్దిరోజులుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 2016లో ‘దంగల్’ సినిమాతో ఆమె బాలీవుడ్ లో ప్రవేశించారు. అమీర్ తోపాటు సాక్షి తన్వర్, సాన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్, జైరా వాసిం వంటి నటులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. మహిళా రెజ్లర్లయిన ఫొగాట్ సిస్టర్స్, వారి తండ్రి మహవీర్ ఫొగాట్ జీవిత కథల ఆధారంగా ‘దంగల్’ సినిమా రూపొందింది. కమర్షియల్ గా భారీ సక్సెస్ సాధించిన ఈ సినిమాకు సుహానీ భట్నాగర్ యాక్టింగ్ హైలెట్ గా నిలిచింది.
అవార్డుల్లో టాప్…
2016 డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘దంగల్’.. బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్, బ్రిక్స్ ఫెస్టివల్ వంటి మెగా ఈవెంట్లలో ఎంట్రీ ఇచ్చింది. 62వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల్లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్షన్ ఇలా నాలుగింటిని గెలుచుకుంది. రూ.70 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి రూ.2,024 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. భారీ వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా.. అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న హాలీవుడేతర మూవీగా ‘దంగల్’ 30వ స్థానంలో నిలిచింది. రూ.2,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ఇప్పటికీ ‘దంగల్’ పేరిటే రికార్డు ఉంది.