రజనీకాంత్ మేనియా మామూలుగా ఉండదు మరి. ఆయన మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ఫ్యాన్స్.. ఇక మూవీ రిలీజ్ అయిందంటే చాలు ఎగబడి చూస్తారు. తాజాగా వచ్చిన ‘జైలర్’ మూవీకి కూడా ఆ రేంజ్ లోనే ఆదరణ కనిపిస్తోంది. ఇప్పటికే ఆ సినిమా ఒక్క తమిళనాడులోనే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందట. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు రూ.600 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీని ఊపేస్తోందట. ‘రోబో’ తర్వాత రజనీకాంత్ కు అనుకున్న స్థాయిలో హిట్లు లేకుండా పోయాయి. మధ్యలో ‘కబాలి’, ‘2.0’, ‘పేట’ సినిమాలు వచ్చినా.. ‘తలైవా’ ఇమేజ్ కున్న రేంజ్ లో ఏదీ ఆడలేదు. గతేడాది వచ్చిన ‘పెద్దన్న’ కూడా నిరాశపరచడంతో రజనీ అయోమయంలో పడినట్లేనని సినీవర్గాలు భావించాయి.
కానీ తన మునుపటి ఫామ్ ను చూపిస్తూ తాజాగా ‘జైలర్’తో మళ్లీ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్నారు రజనీ. ఆయన సరసన రమ్యకృష్ణ లీడ్ రోల్ లో నటించగా తమన్నా స్పెషల్ సాంగ్ లో అప్పియరెన్స్ ఇచ్చారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ జాకీ ష్రాఫ్ మెయిన్ రోల్ లో మెరిశారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా.. ‘బ్లాక్ బస్టర్’ గా నిలుస్తుండటంతో మూవీ యూనిట్ తోపాటు రజనీ సైతం ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.