
ఆయనో బస్ కండక్టర్.. ఆ కండక్టర్ వేసిన విజిల్సే ఒక సెన్సేషన్. ఆ స్టైల్, ఆ లుక్స్ తోనే అందర్నీ ఆకట్టుకుని బస్ లో ఎక్కించుకునేవారాయన. ఎప్పుడో 1970లో పనిచేసిన ఆ కండక్టర్ ఇప్పుడు దేశంలోనే పెద్ద సూపర్ స్టార్. ఇప్పుడా సూపర్ స్టారే తాను కండక్టర్ గా పనిచేసిన డిపోకు వెళ్లాడు. ఒక పేద్ద తెల్లని MUV కారు బస్ డిపో ముందు ఆగింది. కారు డోరు తెరిచి దిగిన ఆ వ్యక్తి అక్కడి పరిసరాల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. డిపో ముందు చాలా మంది ఉన్నా ఎవరూ ఆయన్ను గుర్తు పట్టలేదు. కానీ ఒక సెక్యూరిటీ గార్డు మాత్రం బాగా గమనించి రజినీకాంత్ అని గట్టిగా అరిచాడు. ఇంకేముంది క్షణాల్లో అక్కడంతా ఒకటే సందడి. ఇలా 50 ఏళ్లు వెనక్కు వెళ్లి రజినీకాంత్ బెంగళూరులో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

PHOTO: THE TIMES OF INDIA
సినిమాల్లోకి రాకముందు రజినీ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్. బస్ కండక్టర్ గా బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ BMTSలో పనిచేశారు. మంగళవారం(ఈనెల 29న) బెంగళూరుకు వెళ్లిన సందర్భంగా తాను పనిచేసిన డిపోను చూడాలనుకున్నారు. ఇంకేముంది.. డైరెక్ట్ గా అక్కడికే వెళ్లి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ ఏరియాను పరిశీలించారు. ఆయన కారు దిగుతూనే అప్పటికీ, ఇప్పటికీ ఎంత మార్పు అనుకుంటూ అక్కడే తిరుగుతున్నా ఎవరూ పెద్దగా గుర్తు పట్టలేదు. కానీ ఆ డిపోలోని సెక్యూరిటీ గార్డు అరుపులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రజినీకాంత్ వచ్చాడహో అన్న వాయిస్ తో సీన్ ఛేంజ్ అయింది. డిపోలోనుంచి ఉద్యోగులంతా పరుగు పరుగున వచ్చి రజినీ చుట్టూ చేరారు. కలల స్టార్ కళ్ల ముందు కనపడిన తన్మయత్వంలో తమను తాము మరచిపోయారు. ఒకటే షేక్ హ్యాండ్ లు, సెల్ఫీలు. ‘తలైవా’ను చూస్తూ తనివితీరలేదన్నట్లుగా కొందరైతే కాళ్లకు దండాలు పెట్టారు. ఆ అభిమానాన్ని చూసి రజినీ ఆనందానికి గురయ్యారు. అడిగిన వారికి అడిగినట్లుగా ఎవరినీ కాదనకుండా, తనో సూపర్ స్టార్ అన్న విషయం మరచి అందరితో కలుపుగోలుగా మాట్లాడారు.
1975లో సినీ రంగ ప్రవేశం చేసిన శివాజీరావ్ గైక్వాడ్.. తమిళ మూవీలతో కెరీర్ స్టార్ట్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ బాలచందర్ చొరవతో శివాజీరావ్ గైక్వాడ్ కాస్తా రజినీకాంత్ గా మారారు. BTSలో కండక్టర్ గా పనిచేస్తున్న టైమ్ లో.. రాజ్ బహుదూర్ అనే డ్రైవర్ ఫ్రెండ్ ఇచ్చిన సలహాతోనే ఆయన 1975లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ‘జైలర్’ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ‘జైలర్’ మూవీకి సంబంధించిన ప్రోగ్రాంకు అటెండ్ అయ్యేందుకు రజినీ బెంగళూరు వెళ్లారు. అలాంటి సందర్భంలోనే తాను పనిచేసిన డిపోను చూడాలనుకుని డైరెక్ట్ గా అక్కడికే వెళ్లారు. రజినీని కలవడం, ఆయనతో మాట్లాడటం జీవితానికే అత్యంత మధుర క్షణాలు అని లోహిత్ రామ్ అనే ఉద్యోగి అన్నాడు. ‘మా కొలీగ్ తో మేం మాట్లాడాం.. మా జీవితాలకు ఇది చాలు’ అంటూ ఎమోషనల్ ఫీలయ్యారు. అలా డిపోలో 150 మందితో రజినీ సెల్ఫీలు దిగారు.