
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్.. చంద్రయన్-3. జాబిల్లి అంతరంగాన్ని తెలుసుకునేందుకు ఉద్దేశించిన ఈ మిషన్ రేపు చంద్రునిపై అడుగు పెట్టనుంది. మన దేశ ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. రేపు చంద్రయాన్-3 సక్సెస్ గా మూన్ పై అడుగుపెడితే దేశవ్యాప్తంగా సంబరాలే సంబరాలు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సినీ యాక్టర్ ప్రకాశ్ రాజ్.. వివాదాస్పద కామెంట్ చేశారు. స్పేస్ మిషన్ తీరుపై ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. చంద్రయాన్-3ని అపహాస్యం చేశారంటూ ప్రకాశ్ రాజ్ పై కేసు నమోదైంది. ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మాజీ ఛైర్మన్ కె.శివన్ పై వ్యంగ్యంతో కూడిన ఫొటోను షేర్ చేశారు. ISRO మాజీ చీఫ్ శివన్.. లుంగీ కట్టుకుని పైనున్న పెద్ద స్టీల్ కప్ నుంచి కింద ఉన్న స్టీల్ కప్ లో చాయ్ పోస్తున్నట్లుగా ఉన్న ఫొటోను అందులో ఉంచారు. దేశ శాస్త్రవేత్తల శక్తి సామర్థ్యాల్ని కించపరుస్తున్నట్లుగా తయారైన ట్వీట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ ఘటనపై కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా బనహట్టి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కొందరు.. భారత అంతరిక్ష ప్రయోగంపై అవహేళన చేసేలా ట్వీట్ పెట్టారంటూ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. హిందూ సంస్థలకు చెందిన కొందరు ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేశారు. ఇలా చంద్రయాన్-3 మిషన్ పై ప్రకాశ్ రాజ్ పెట్టిన వ్యంగ్య చిత్రం.. దేశ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందన్న మాటలు వినపడుతున్నాయి. దీనిపై కేవలం హిందూ సంఘాలే కాకుండా వివిధ వర్గాల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. మన దేశ ప్రయోగ సామర్థ్యం(Capability)పై వరల్డ్ వైడ్ గా నమ్మకం కలగడంతో… స్పేస్ పరంగా పెద్దయెత్తున వాణిజ్య ఒప్పందాలు వస్తున్నాయి. మరోవైపు అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీనియర్ యాక్టర్ పెట్టిన ట్వీట్.. దేశ అంతరిక్ష రంగాన్ని అవహేళన చేసే విధంగా తయారైంది. ఏవైనా ఉంటే రాజకీయం లేదా వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ ఇలా వ్యవస్థలపై చూపించడం మంచిది కాదని మరికొందరు అంటున్నారు.