
ఛార్ ధామ్ యాత్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ ను దర్శించుకునేందుకు వెళ్లి నిబంధనల్ని ఉల్లంఘించిన(Rules Violation) బాలీవుడ్ యువ నటి సారా అలీఖాన్ పై కేసు నమోదైంది. వన్యప్రాణుల ప్రాంతం(Wildlife Sanctuary)లో హెలికాప్టర్ ల్యాండింగ్ చేసినందుకు సదరు ఏవియేషన్ సంస్థపైనా కేసు ఫైల్ చేశారు. కేదార్ నాథేశ్వరుడిని దర్శంచుకునేందుకు సారా అలీఖాన్.. ప్రత్యేక హెలికాప్టర్ లో ఉత్తరాఖండ్ చేరుకున్నారు. టెంపుల్ ఏరియా సమీపంలో మడ్ మహేశ్వర్ వద్ద అటవీ ప్రాంతంలో చాపర్(Helicopter)ను ల్యాండింగ్ చేశారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ల్యాండింగ్ చేసి సాయంత్రం 4:35 గంటల దాకా అక్కడే నిలిపి ఉంచారు.
క్లియరెన్స్ తోనే ల్యాండింగ్
అయితే అది దట్టమైన అటవీ ప్రాంతానికితోడు వన్యప్రాణులు తిరిగే ప్రదేశం కావడంతో అక్కడున్నవారు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కంప్లయింట్ తో పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే పూర్తి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే అక్కడ హెలికాప్టర్ ను ల్యాండ్ చేసినట్లు తుంబే ఏవియేషన్ సంస్థ CEO గోవింద్ నాయర్ క్లారిటీ ఇచ్చారు. నిబంధనలకు అనుగుణంగా అక్కడ దిగామని, నోటీసులు ఇచ్చినట్లు తమకు తెలియదన్నారు.