ఆయన అరంగేంట్రం చేయించిన కథానాయికలు టాప్ పొజిషన్ కు వెళ్లారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అత్యుత్తమ నటీమటులుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి చేయూత అందించిన ప్రముఖ నటుడిని తెలుగు చలన చిత్ర పరిశ్రమ కోల్పోయింది. తన సినిమాల్లోని నటనతో, తన చేయూతతో ఎంతోమందికి ఆదరణ కల్పించిన చంద్రమోహన్(80) కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. ‘పదహారేళ్ల వయసు’, ‘సిరిసిరిమువ్వ’ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన మృతి పట్ల CM కేసీఆర్ తోపాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లోని ప్రముఖులు సంతాపం తెలిపారు.
చంద్రమోహన్ తో నటించే హీరోయిన్లకు తిరుగుండదనేది ఆయనకు ఉన్న పేరు. అందుకు ఉదాహరణే అందాల నటి శ్రీదేవి. ‘పదహారేళ్ల వయసు’తోనే చంద్రమోహన్ తో జత కట్టి ఇక సినీ ఇండస్ట్రీలో వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదామెకు. ‘సిరిసిరిమువ్వ’తో జయప్రదతోపాటు జయసుధ, విజయశాంతి, రాధిక, మంజుల, ప్రభ ఈయనతో నటించిన తర్వాతే గొప్ప స్థాయికి చేరుకున్నారన్న పేరుంది. 1943 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో జన్మించిన చంద్రమోహన్.. 1966లో రంగుల రాట్నంతో సినిమాల్లోకి వచ్చిన ఆయన.. 6 నంది, రెండు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.
తెలుగుతోపాటు పలు తమిళ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన చంద్రమోహన్.. 55 ఏళ్లపాటు నటుడిగా కొనసాగారు. స్టోరీలు, డైరెక్టర్లు, హీరోయిన్ల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న ఈ విభిన్న నటుడు.. తన సినీ జీవితంలో 900కు పైగా మూవీల్లో నటించారు. కె.విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘అల్లూరి సీతారామరాజు’, ‘ఆత్మీయులు’, ‘జీవనతరంగాలు’, ‘ఇంటింటి రామాయణం’, ‘ఓ సీత కథ’, ‘కాంచనగంగా’, ‘అల్లుడుగారు’, ‘పెద్దరికం’, ‘నిన్నే పెళ్లాడతా’తోపాటు ఎన్నో హిట్ సినిమాలతో అలరించారు.