సినిమా ఇండస్ట్రీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. సినిమా షోలు, టికెట్స్ రేట్ల వంటి వాటిపై గతంలోనే ఆందోళన కనిపించగా.. తాజాగా పవన్ కల్యాణ్, అంబటి రాంబాబు ఇష్యూ సంచలనంగా మారింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం జగన్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీపైనే కాకుండా ప్రజలపై దృష్టిపెట్టాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల ఫంక్షన్ లో ఆయన.. AP ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజల అభివృద్ధిపై దృష్టి ఉండాలన్న చిరు.. సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి రంగాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన కనిపించాలన్నారు. ప్రాజెక్టులు, రోడ్లు, ప్రత్యేక హోదా వంటివి కాకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై పడ్డారని ఫైర్ అయ్యారు.
ప్రజల గురించి పట్టించుకోకుండా జగన్ సర్కారు కేవలం సినిమా ఇండస్ట్రీపైనే మెయిన్ ఫోకస్ చేయడం ఏ మాత్రం క్షేమకరం కాదని విమర్శించారు. పేదలకు కడుపు నింపే పథకాలపైనే సర్కారుకు శ్రద్ధ ఉండాలని, అందరికీ ఉపాధి కల్పించి బాగున్నప్పుడే ప్రజలు మెచ్చుకుంటారని మెగాస్టార్ చురకంటించారు.