‘పొన్నియిన్ సెల్వన్’తో పాన్ ఇండియా హిట్ అందుకున్న విక్రమ్… తన తాజా(Latest) సినిమాపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. మూడేళ్ల పాటు సాగుతున్న ‘తంగలాన్’ను ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాశ్ హింట్ ఇచ్చారు. గతేడాది నవంబరులోనే పూర్తయి ఈ జనవరిలో విడుదల కావాల్సి ఉన్నా పలు సార్లు వాయిదా పడింది.
కేజీఎఫ్ యోధుడిగా…
స్వాతంత్ర్యాని(Independence)కి ముందు జరిగే ఘటనతో పీరియాడిక్ యాక్షన్ మూవీగా తయారైంది ‘తంగలాన్’. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(KGF)లో పనిచేసే కార్మికుల కోసం పోరాడే యోధుడిగా విక్రమ్ పాత్రను మలిచారు. బ్రిటిష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ కు గాను ఆయన సరికొత్త లుక్ లో కనిపించేలా ఆహార్యం రూపుదిద్దుకుంది. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో విడుదల చేసేలా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఇది రిలీజ్ కానుంది.
భారీ హైప్స్…
ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పట్నుంచి ‘తంగలాన్’పై భారీ హైప్స్ క్రియేటయ్యాయి. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఉంటాయని భావిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప-2 డిసెంబరుకు వాయిదా పడటం వల్లే ‘తంగలాన్’ను పంద్రాగస్టుకు షెడ్యూల్ చేశారన్న మాటలున్నాయి. పా రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్-నీలం ప్రొడక్షన్స్ జాయింట్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయిక.