
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తన పేరు ప్రస్తావించడంపై కథానాయకుడు నవదీప్.. హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ నెల 19 వరకు నవదీప్ ను అరెస్టు చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ పోలీసులకు సూచిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా.. మత్తుపదార్థాల దందాలో 18 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించి పలువురిని అరెస్టు చేశారు. సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డితోపాటు బాలాజీ, మురళిని అరెస్టు చేసి విచారణ నిర్వహిస్తే.. నిందితుల పేర్లు బయటపడ్డాయి. దీంతో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం(ఈనెల 14న) రిమాండ్ కు తరలించారు.
ఈ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురి హస్తం ఉందని హైదరాబాద్ CP సి.వి.ఆనంద్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో నవదీప్ పాత్ర ఉన్నట్లు సీపీ తెలపడంతో.. సినీ పరిశ్రమలో కలకలం మొదలైంది. నైజీరియన్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా నవదీప్ డ్రగ్స్ వాడారని పేర్కొంటూ అతణ్ని A29గా చేర్చుతూ కేసు ఫైల్ చేశారు. తనను అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో నవదీప్.. ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.