
అఖండ-2 సినిమాకు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ప్రీమియర్ షో సహా టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ ను న్యాయస్థానం రద్దు చేసింది. నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్, ఫిల్మ్
డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోతోపాటు రేపట్నుంచి మూడు రోజుల పాటు సింగిల్, మల్టీప్లెక్స్ స్క్రీన్లకు అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రీమియర్ షోకు రూ.600, ఈనెల 12, 13, 14 తేదీల్లో సింగిల్ స్క్రీన్లకు రూ.50, మల్టీప్లెక్స్ ల్లో రూ.100 అదనంగా వసూలు చేసేందుకు అనుమతిచ్చింది. ఈ పెంపుపై దాఖలైన పిటిషన్ పై జస్టిస్ శ్రవణ్ కుమార్ విచారణ జరిపారు. టికెట్ ధరల్లో వచ్చిన ఆదాయంలో 20 శాతాన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఇవ్వడం ద్వారా కార్మికులను ఆదుకుంటారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. గతంలో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగినా తరచూ ఇలాంటి సర్క్యులర్లు ఎందుకిస్తున్నారంటూ కోర్టు ప్రశ్నించింది.