రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు రెచ్చిపోయి వీరంగం సృష్టించారు. థియేటర్ లో నానా హంగామా సృష్టించి అందర్నీ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో జరిగింది. యోగి మూవీ రీ-రిలీజ్ సందర్భంగా సుదర్శన్ థియేటర్ లో అభిమానులు సందడి సందడి చేశారు. ఒకటే ఈలలు, గోలలు, డ్యాన్స్ లతో హోరెత్తించారు. ఇది మిగతా వారికి ఇబ్బందికరంగా తయారైంది. ఇలా అరుపులు, డ్యాన్స్ ల మధ్య సినిమా చూసే పరిస్థితి కనిపించలేదు. దీంతో అందరి ఇబ్బందుల్ని గమనించిన థియేటర్ మేనేజ్మెంట్.. డ్యాన్స్ లతో హోరెత్తుస్తున్న ఫ్యాన్స్ ను నిలువరించే ప్రయత్నం చేసింది. మమ్మల్నే అడ్డుకుంటావా అంటూ ఒక్కసారిగా సదరు ఫ్యాన్స్ కొందరు ఊగిపోయారు.
టాకీస్ లోని స్క్రీన్ తోపాటు ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు. థియేటర్ స్క్రీన్ పై కూల్ డ్రింక్ బాటిల్స్ తో దాడికి తెగబడ్డారు. అటు సినిమా హాల్ బయట కూల్ డ్రింక్ పెట్టెలతో దాడికి దిగారు. ఈ ఘటనపై థియేటర్ మేనేజ్మెంట్.. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. దీంతో చిక్కడపల్లి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. అటు APలోని కాకినాడ, నంద్యాలలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది.