
ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రం ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దర్శకుడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌కు తను శిష్యుడు కాగా.. దర్శకుడిగా కార్తీక్‌కు ఇదే మొదటి సినిమా. అయినప్పటికీ ఈ మిస్టిక్ థ్రిల్లర్‌ను అద్భుతంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతోనే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఇక ఈ చిత్రానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే.. ‘విరూపాక్ష’ మేకర్స్ తాజాగా దర్శకుడు కార్తీక్‌కు మెర్సిడెజ్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘విరూపాక్ష’ చిత్ర నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ కలిసి ఈ బ్లాక్ కలర్ బెంజ్ కారును గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. ఈ మేరకు మంగళవారం హీరో సాయిధరమ్ తేజ్, సుకుమార్ కలిసి కార్తీక్‌కు కారును అందజేశారు. ఈ సర్ప్రైజ్తో పొంగిపోయిన కార్తీక్.. ఆ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే.. మొదటి సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న కార్తీక్ వర్మ ఇంకా తన కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు.