
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళాశంకర్’ వివాదంలో చిక్కుకుంది. సినిమా నిర్మాతలు తనను ‘ఏజెంట్’ మూవీ సమయంలో మోసం చేశారంటూ కోర్టును ఆశ్రయించారు డిస్ట్రిబ్యూటర్. తనకు ‘ఏజెంట్’ సినిమా టైమ్ లో రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉందని డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ పిటిషన్ వేశారు. AK ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భోళాశంకర్’ తెరకెక్కగా.. ఆ మూవీ ప్రొడ్యూసర్స్ రూ.30 కోట్లు చెల్లించాలని, ఆ మొత్తాన్ని ఇప్పించాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదలయ్యే 15 రోజుల ముందుగానే డబ్బులు ఇస్తామని గతంలోనే చెప్పారని, కానీ మాట తప్పి రేపు సినిమా రిలీజ్ చేస్తున్నారని పిటిషన్ లో తెలియజేశారు. మరోవైపు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సదరు డిస్ట్రిబ్యూటర్ పోలీసులను ఆశ్రయించారు. సినిమా రిలీజ్ ఆపేయాలన్న పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. దీనిపై నేడు కోర్టు తీర్పు వెల్లడించనుంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఈ నెల 11న రిలీజ్ కానుందని ఇంతకుముందే మూవీ యూనిట్ ప్రకటించింది. మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ రేపు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న సమయంలో డిస్ట్రిబ్యూటర్ కేసు వేశారు. తమన్నా, కీర్తి సురేశ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా.. AK ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, K.S.రామారావు జాయింట్ గా నిర్మించారు. కోల్ కతా బ్యాక్ గ్రౌండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన అజిత్ మూవీ ‘వేదాళం’కు రీమేక్ గా ‘భోళా శంకర్’ తెరకెక్కుతోంది.