హైదరాబాద్ మాదాపూర్ లో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంలో పెద్ద పెద్ద తలకాయల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పై నిఘా పెట్టిన అధికారులకు కీలక నెట్ వర్క్ చిక్కింది. ఇందులో నావికాదళానికి(Navy) చెందిన మాజీ అధికారి ముఖ్య పాత్ర పోషించడం సంచలనం రేపింది. ఈయనతోపాటు సినీ ఫైనాన్షియర్, మరో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పాత్ర ఉన్నట్లు గుర్తించి ఆ ముగ్గుర్నీ అరెస్టు చేశారు. మెయిన్ నిందితుడు బాలాజీకి కొన్నేళ్ల క్రితం కన్నుకు దెబ్బతాకడంతో నేవీ నుంచి వైదొలిగి ఈ అక్రమ దందాలో చేరినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో రెగ్యులర్ గా పార్టీలు నిర్వహిస్తున్న బాలాజీ.. మాదాపూర్ లోని అపార్ట్ మెంట్లోనూ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో పోలీసులు దాడి చేశారు. ఈయనకు హైదరాబాద్, బెంగళూరులోని డ్రగ్స్ సప్లయర్స్ అయిన నైజీరియన్స్ తో సంబంధాలు ఏర్పడ్డాయి. నైజీరియన్స్ నుంచి డ్రగ్స్ కొని తనకు తెలిసిన, పరిచయమున్న వారికి వాటిని అమ్ముతున్నాడు. బెంగళూరులో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు, విశాఖపట్నానికి చెందిన మరో వ్యక్తితో బాలాజీకి లింకులున్నాయని పోలీసులు తెలిపారు. ఇలాంటి నెట్ వర్క్ తో క్రమంగా సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి పరిచయమయ్యారు. ఈయన ‘ఢమరుకం’, ‘ఆటోనగర్ సూర్య’, ‘లవ్ లీ’, ‘కిక్’ సినిమాలకు ఫైనాన్షియర్ గా ఉన్నాడు.
ఇక మూడో వ్యక్తి మురళి RPF ఐజీ వద్ద స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి కూడా తరచూగా పార్టీలు ఇవ్వడం, పరిచయాలు పెరగడంతో పెద్దమొత్తంలో డ్రగ్స్ కావాలంటూ బాలాజీకి డబ్బు ఇచ్చాడు. మాదాపూర్ తోపాటు గుడిమల్కాపూర్ లో రెయిడ్స్ చేసిన పోలీసులకు భారీస్థాయిలో డ్రగ్స్ దొరికాయి. గుడి మల్కాపూర్ లోని అపార్ట్ మెంట్ పై దాడి చేసిన యాంటీ నార్కోటిక్ పోలీసులు.. బాలాజీని అరెస్టు చేయడంతో అసలు గుట్టంతా బయటకు వచ్చింది. బాలాజీని అరెస్టు చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు… అతడిచ్చిన ఇన్ఫర్మేషన్ తో మాదాపూర్ విఠల్ రావునగర్ లోని అపార్ట్ మెంట్లో ఈరోజు తెల్లవారుజామున దాడి చేశారు. ఈ కేసులో నలుగురు సప్లయర్స్ కాగా అందులో నైజీరియన్లు, మరో 18 మంది కన్జ్యూమర్స్ ను గుర్తించగా.. వీరంతా పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళిని అరెస్టు చేసి 2.8 గ్రాముల కొకైన్, 6 బ్లాట్స్ LSD, 11.5 గ్రాముల విలువైన 25 ఎక్టాసీ పిల్స్ పీస్ లు, 20 గ్రాములు గల రెండు ప్యాకెట్ల గంజాయి, రూ.72,500, 2 కార్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.